Andhra News: ఉగాదికి లక్ష టిడ్కో ఇళ్లు సిద్ధం..ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులమీదుగా పంపిణీ
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీ వ్యాప్తంగా టిడ్కో గృహ సముదాయాల్లో నిర్మాణం పూర్తైన లక్ష ఇళ్లను రానున్న ఉగాది పండుగ నాటికి లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లక్ష ఇళ్లలో 300 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఇళ్లు 54,934 ఉండగా, 365 చదరపు అడుగులవి 16,223, 430 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్నవి 28,986గా ఉన్నాయి. ఉగాది సందర్భంగా ముఖ్యమంత్రి చేతులమీదుగా లబ్ధిదారులతో గృహప్రవేశ కార్యక్రమాలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గత వైకాపా ప్రభుత్వ కాలంలో టిడ్కో ఇళ్ల నిర్మాణాలు సకాలంలో పూర్తికాకపోవడంతో అనేక గృహ సముదాయాలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులకు వేగం పెంచి, నిలిచిపోయిన ప్రాజెక్టులను ముందుకు తీసుకువచ్చింది.
వివరాలు
నిరుపయోగ ఖాతాలుగా మారిన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలు
గత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాల కోసం తెచ్చిన అప్పులను ఇతర అవసరాలకు మళ్లించడంతో పాటు, లబ్ధిదారుల వాటాగా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని కూడా ఇళ్లను పూర్తి చేసి అప్పగించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో అనేక మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలు నిరుపయోగ ఖాతాలుగా మారాయి. కూటమి ప్రభుత్వం ఈ సమస్యలన్నింటినీ క్రమంగా పరిష్కరిస్తూ,ఇళ్ల నిర్మాణాలతో పాటు అవసరమైన మౌలిక వసతులన్నింటినీ పూర్తి చేసింది. టిడ్కో ఇళ్ల నిర్మాణానికి రుణాలు సమకూర్చేందుకు గత వైకాపా హయాంలో హడ్కో నుంచి రుణం పొందేందుకు అధికారులు రెండేళ్ల పాటు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మాటలకే పరిమితమై ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. బ్యాంకులు కూడా రుణాలిచ్చేందుకు వెనకడుగు వేశాయి.
వివరాలు
లబ్ధిదారుల వాటాగా మరో రూ.1,500 కోట్లు
అయితే తాజాగా కూటమి ప్రభుత్వం ప్రభుత్వ హామీతో ముందుకు రావడంతో, హడ్కో రూ.4,451 కోట్ల రుణాన్ని మంజూరు చేయడానికి అంగీకరించింది. దీనితో పాటు లబ్ధిదారుల వాటాగా మరో రూ.1,500 కోట్ల వరకు సమకూరనున్నాయి. ఈ నిధులతో మిగిలిన అన్ని నిర్మాణాలను జూన్ నెలాఖరులోపు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేందుకు అధికారులు ఇప్పటికే కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. అలాగే గత వైకాపా ప్రభుత్వం కాలంలో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన బిల్లులు చెల్లించకుండా గుత్తేదారులను వేధించిన సంగతి తెలిసిందే.
వివరాలు
దాదాపు రూ.500 కోట్ల వరకు బకాయిలు పెండింగ్
2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణ పనులకు సంబంధించిన బిల్లులు కూడా చెల్లించకుండా ఉంచారు. ఈ విధంగా మొత్తం దాదాపు రూ.500 కోట్ల వరకు బకాయిలు పెండింగ్‌లో పెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పెండింగ్ నిధులను చెల్లించడమే కాకుండా, ప్రస్తుతం జరుగుతున్న పనుల్లో జాప్యం లేకుండా గుత్తేదారులకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తూ నిర్మాణాలు సజావుగా సాగేలా చర్యలు తీసుకుంటోంది.