కునో నేషనల్ పార్కులో మరో చీతా మృతి.. ఆందోళన రేకెత్తిస్తున్న చీతాల వరుస మరణాలు
భారతదేశంలో చీతాలు అంతరించిపోయే దశ మళ్లీ మొదలవుతోంది. ఈ మేరకు మరో చితా ప్రాణాలు కోల్పోయింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కునో నేషనల్ పార్కులో ధాత్రి అనే చిరుతపులి ఆరోగ్య సమస్యలతో మరణించడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. తాజాగా ప్రాణం విడిచిన థాత్రి చీతాఆఫ్రికా పేరు తిబ్లిసిగా అధికారులు పేర్కొన్నారు. చీతాల సంతతిని వృద్ధి చేసేందుకు ఆఫ్రికన్ దేశాల నుంచి అనేక చీతాలను భారత్ కు తరలించారు. ఇప్పడు ఆయా చీతాలు వరుసగా వేర్వేరు కారణాలతో చనిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కునో అభయారణ్యంలో థాత్రి అనే చీతా మరణించిందని బధవారం ఉదయం పార్క్ సిబ్బంది గుర్తించారు. అనంతరం దానికి పోస్ట్ మార్టం నిర్వహించారు. పూర్తి వివరాలను ప్రక్రియ పూర్తయ్యాక వెల్లడిస్తామన్నారు.
చీతాల వరుస మరణాలపై కేంద్రానికి సుప్రీం నోటీసులు
ఇండియాలో దాదాపుగా 70 ఏళ్ల కిందటే చీతా జాతి అంతరించిపోయింది. ఈ నేపథ్యంలోనే గత ఏడాది కేంద్ర ప్రభుత్వం నమీబియా, దక్షిణాఫ్రికా దేశాల నుంచి దాదాపు 20 చీతాలను తెప్పించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా జన్మదిన సందర్భంగా ఆయా చీతాలను జాతీయ పార్కులో విడిచిపెట్టారు. ఇప్పుడు ఆయా చీతాలు ప్రాణాలు కోల్పోవడం సర్వత్రా ఆందోళన కలిగించే అంశంగా మారింది. తాజాగా జ్వాల అనే ఆడ చీతా నాలుగు పిల్ల చీతాలకు జన్మనిచ్చింది. అందులో మూడు పిల్లలు చనిపోయాయి. మొత్తంగా ఇప్పటివరకు 9 చీతాలు మేర మృతి చెందాయి. మరోవైపు చీతాల వరుస మరణాలపై దాఖలైన పిటిషన్లను ఇప్పటికే స్వీకరించిన సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.