జునాగఢ్: ఆక్రమణల కూల్చవేతలో పోలీసులపై రాళ్ల దాడి; ఒకరు మృతి
గుజరాత్‌లోని జునాగఢ్ జిల్లాలో జరిగిన ఘర్షణల్లో ఒక వ్యక్తి చనిపోయాడు. జునాగఢ్ మున్సిపల్ అధికారులు ఆక్రమణ తొలగింపులో భాగంగా ఒక దర్గాకు కూల్చివేత నోటీసును అందజేశారు. ఇది ఈ హై డ్రామాకు దారితీసింది. దర్గాకు సంబంధించిన పత్రాలను ఐదు రోజుల్లోగా పత్రాలను సమర్పించాలని జునాగఢ్ మునిసిపల్ కార్పొరేషన్ నోటీసు ఇచ్చింది. కూల్చివేత నోటీసులు అందుకున్న తర్వాత శుక్రవారం రాత్రి దర్గా చుట్టూ కనీసం 500-600 మంది గుమిగూడి, పోలీసు అధికారులపై రాళ్లు రువ్వారు. పోలీసు పోస్ట్‌ను ధ్వంసం చేశారు. పోలీసు వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ దాడిలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సహా ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. హింసాత్మక ఘటనలకు సంబంధించి 174 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిరసనకారులు చెదరగొట్టేందుకు లాఠీ చార్జ్
జునాగఢ్ పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) రవితేజ వాసంశెట్టి ఈ ఘటనపై మాట్లాడారు. మాజేవాడి గేట్ సమీపంలోని మసీదుకు సంబంధించిన పత్రాలను ఐదు రోజుల్లో పత్రాలను సమర్పించాలని జునాగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ నోటీసు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో 500-600 మంది ప్రజలు మసీదు వద్ద గుమిగూడి నిరసన తెలిపారని, రహదారిని దిగ్బంధించవద్దని పోలీసులు ఒప్పించే ప్రయత్నం చేసినట్లు వెల్లడించారు. అనంతరం పోలీసులపై నిరసనకారులు రాళ్లతో దాడి చేయడంతో వారిని చెదరగొట్టేందుకు లాఠీ చార్జ్ చేసినట్లు రవితేజ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాళ్లదాడిలో ఒక పౌరుడు మృతి చెందగా, కొంతమంది పోలీసు సిబ్బంది గాయపడ్డారని ఆయన చెప్పారు.