LOADING...
ONGC: ఏపీలో ఓఎన్‌జీసీ భారీ ప్రాజెక్టు.. కోనసీమలో వేల కోట్లతో చమురు,గ్యాస్‌,ఆయిల్ అన్వేషణకు సిద్ధం 
కోనసీమలో వేల కోట్లతో చమురు,గ్యాస్‌,ఆయిల్ అన్వేషణకు సిద్ధం

ONGC: ఏపీలో ఓఎన్‌జీసీ భారీ ప్రాజెక్టు.. కోనసీమలో వేల కోట్లతో చమురు,గ్యాస్‌,ఆయిల్ అన్వేషణకు సిద్ధం 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 07, 2025
08:35 am

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీలో చమురు, సహజ వాయువు అన్వేషణకు సంబంధించి ప్రభుత్వరంగ సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్‌ (ఓఎన్‌జీసీ) పెద్ద ఎత్తున ముందుకు వచ్చింది. రాష్ట్రంలోని కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్ పరిధిలో చమురు, గ్యాస్‌ అన్వేషణను విస్తరించేందుకు వేల కోట్ల రూపాయల పెట్టుబడితో భారీ ప్రాజెక్టును చేపట్టేందుకు సిద్ధమైంది. సుమారు రూ.8,110 కోట్ల వ్యయంతో 172 కొత్త బావులను తవ్వే ప్రణాళికకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖకు చెందిన నిపుణుల కమిటీ తాజాగా ఆమోదం తెలిపింది. ఈ బావులు ప్రధానంగా కోనసీమ ప్రాంతంలోని భూభాగంలో తవ్వనున్నారు.

వివరాలు 

కోనసీమ ప్రాంతంలోని 8 బ్లాకుల్లో చమురు, గ్యాస్ అన్వేషణ 

ఈ ప్రాజెక్టు కింద, కోనసీమలో ఓఎన్‌జీసీకి కేటాయించిన ఎనిమిది పెట్రోలియం మైనింగ్ లీజు (పీఎంఎల్) బ్లాకుల్లో తవ్వకాలు జరగనున్నాయి. మొత్తం వ్యయంలో, పర్యావరణ నిర్వహణ కోసం రూ.172 కోట్లు, అలాగే ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాల కోసం మరో రూ.11 కోట్లు కేటాయించినట్లు ఓఎన్‌జీసీ ప్రకటించింది. అయితే పర్యావరణ పరిరక్షణపై దృష్టి పెట్టిన నిపుణుల కమిటీ కొన్ని కఠినమైన షరతులు విధించింది. ముఖ్యంగా తవ్వే బావులు కోరంగి వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి 10 కిలోమీటర్ల పరిధిలో ఉండకూడదని స్పష్టం చేసింది. అంతేకాకుండా, అటవీ ప్రాంతాలు లేదా ఇతర సంరక్షిత ప్రాంతాల గుండా పైప్‌లైన్లు వేయాల్సి వస్తే తప్పనిసరిగా ముందస్తు అనుమతులు తీసుకోవాలని ఆదేశించింది.

వివరాలు 

పర్యావరణ పరిరక్షణకు కఠిన నిబంధనలు విధింపు 

ఇప్పటికే కోనసీమలో చమురు క్షేత్రాల వల్ల భూమి కుంగిపోతోందన్న ఆందోళనల నేపథ్యంలో ఈ షరతులు విధించినట్లు తెలుస్తోంది. కృష్ణా-గోదావరి బేసిన్‌లో సుమారు 69.8 కోట్ల టన్నుల చమురు, సహజ వాయువు నిక్షేపాలు ఉన్నాయని అంచనా. దేశంలో ఇంధన అవసరాలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో, ఓఎన్‌జీసీతో పాటు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కూడా ఈ ప్రాంతంలో అన్వేషణ పనులను వేగవంతం చేశాయి. మరోవైపు, పునరుత్పాదక ఇంధన వినియోగం పెరుగుతున్నప్పటికీ, చమురు వినియోగం తగ్గే సూచనలు లేవు. 2050 నాటికి చమురు డిమాండ్‌ దాదాపు రెట్టింపు అవుతుందని బ్రిటిష్‌ పెట్రోలియం (బీపీ) నివేదికలు సూచిస్తున్నాయి. ఈ పరిణామాల దృష్ట్యా దేశీయ ఉత్పత్తిని పెంచడం లక్ష్యంగా ఓఎన్‌జీసీ ఈ భారీ ప్రాజెక్టును ప్రారంభిస్తోంది.