ఆపరేషన్ 'కావేరి': సూడాన్ నుంచి 1100మంది భారతీయులు తరలింపు
'ఆపరేషన్ కావేరి' కింద, భారతదేశం ఇప్పటివరకు సూడాన్ నుంచి దాదాపు 1100 మందిని తరలించింది. సైన్యం, పారామిలటరీ దళం మధ్య స్వల్ప కాల్పుల విరమణ ముగిసేలోపు సూడాన్ నుంచి మరింత మిగిలిన అందరిని స్వదేశానికి తీసుకురావాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. నాలుగో ఐఏఎఫ్ సీ-130జే విమానం 128 మంది ప్రయాణికులతో సుడాన్ పోర్ట్ జెడ్డా నుంచి గురువారం ఉదయం బయలుదేరినట్లు విదేశాంగ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్వీట్ చేశారు. దీంతో సూడాన్ నుంచి భారతదేశంకు తరలించిన వారి సంఖ్య 1100 మందికి చేరుకున్నట్లు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 6బ్యాచ్‌లను తరలించినట్లు బాగ్చి పేర్కొన్నారు.
వాణిజ్య విమానంలో మరో 360 మంది దిల్లీకి తరలింపు
మొదటి బ్యాచ్‌లో 278మంది పౌరులను భారత్‌కు తరలించగా, రెండో బ్యాచ్‌లో 121 మంది, మూడో బ్యాచ్‌లో 135మంది, నాలుగో బ్యాచ్‌లో 136 మంది, ఐదో రౌండ్‌లో 297 మంది, ఆరో రౌండ్‌లో 128 మంది పౌరులను విదేశాంగ శాఖ భారత్‌కు తరలించింది. వాణిజ్య విమానంలో బుధవారం రాత్రి 360 మందితో కూడిన మరో బృందం జెడ్డా నుంచి దిల్లీకి చేరుకుంది. సూడాన్‌లో భారతీయుల తరలింపును విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ పర్యవేక్షిస్తున్నారు. సుడాన్‌లో సైన్యం, పారామిలటరీ బలగాల మధ్య జరుగుతున్న భీకర పోరాటంలో ఇప్పటి వరకు 400మంది మరణించారు.