General Dwivedi: ఆపరేషన్ సిందూర్ భారత్ సామర్థ్యానికి నిదర్శనం: జనరల్ ద్వివేది
ఈ వార్తాకథనం ఏంటి
ఆపరేషన్ సిందూర్ భారత్ సంకల్పం, సైనిక సామర్థ్యం, అలాగే సంయమనానికి స్పష్టమైన నిదర్శనంగా నిలిచిందని భారత సైన్యాధిపతి పదవీ విరమణ చేస్తున్న జనరల్ ఉపేంద్ర ద్వివేది పేర్కొన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ అత్యంత సమతుల్యమైన సైనిక చర్య చేపట్టిందని ఆయన అన్నారు. సీఎన్‌ఎన్-న్యూస్18కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ ఆధునిక యుద్ధాల్లో నిఘా సమాచారానికి, సాంకేతికత ఆధారిత వ్యూహాలకు ఉన్న ప్రాధాన్యాన్ని మరోసారి నిరూపించిందని ద్వివేది తెలిపారు. భవిష్యత్‌లో జరిగే యుద్ధాలు మరింత తీవ్రంగా ఉండటంతో పాటు అత్యాధునిక సాంకేతికత ఆధారంగా సాగుతాయని, ప్రతి చర్యపై ప్రపంచవ్యాప్తంగా సమాచార పర్యవేక్షణ కూడా ఉంటుందని చెప్పారు.
వివరాలు
సైన్యాధిపతి పదవి నుంచి పదవీ విరమణ
ఆధునిక సైనిక చర్యల్లో నిఘా సమాచారం, పర్యవేక్షణ వ్యవస్థలు, ఖచ్చితమైన లక్ష్య ఛేదన సామర్థ్యం, సురక్షిత కమ్యూనికేషన్, సమాచార నిర్వహణ, ఉమ్మడి ప్రణాళికలు అన్నీ సమన్వయంతో పనిచేయడం అత్యంత కీలకమని ఆయన వివరించారు. విశ్వసనీయమైన సమాచారం, దేశ సంకల్పం, సమన్వయంతో కూడిన సైనిక చర్యలు కలిస్తే నిర్ణయాత్మక విజయాలు సాధించవచ్చని ఆపరేషన్ సిందూర్ నిరూపించిందన్నారు. మంగళవారం ఆయన సైన్యాధిపతి పదవి నుంచి పదవీ విరమణ చేయనున్నారు. 2025 మే 7న జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో పాకిస్థాన్ మద్దతుతో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించింది. ఇందులో పాకిస్థాన్‌తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం కచ్చితమైన దాడులు నిర్వహించింది.
వివరాలు
మే 10న కాల్పుల విరమణ కోరిన పాకిస్థాన్
అనంతరం పాకిస్థాన్ భారత నగరాలు, సైనిక స్థావరాలపై దాడులకు పాల్పడటంతో భారత్ కూడా పాకిస్థాన్ సైనిక స్థావరాలు, వైమానిక స్థావరాలు, రన్‌వేలు, వైమానిక రక్షణ కేంద్రాలు, కీలక రక్షణ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. చివరకు మే 10న పాకిస్థాన్ కాల్పుల విరమణ కోరడంతో భారత్ అంగీకరించగా ఘర్షణలకు ముగింపు లభించింది. భారత సైన్యంలో జరుగుతున్న ఆధునికీకరణ గురించి మాట్లాడుతూ, కొత్త ఆయుధాలు లేదా యుద్ధ పరికరాల కొనుగోలుకే అది పరిమితం కాదని ద్వివేది స్పష్టం చేశారు. సైనిక వ్యవస్థ, శిక్షణ, సాంకేతికత, యుద్ధ సిద్ధాంతాలు, పరిపాలనా విధానాలు, మానవ వనరుల నిర్వహణ వంటి అన్ని రంగాల్లో సమగ్ర మార్పులు తీసుకువస్తున్నామని తెలిపారు.
వివరాలు
సాంకేతిక యుద్ధాలకు పూర్తిస్థాయిలో సిద్ధమయ్యేలా చర్యలు
ఇటీవలి సైనిక అనుభవాల ప్రకారం భవిష్యత్ విజయాలు నిఘా వ్యవస్థలు, పర్యవేక్షణ సాంకేతికత, ఆయుధాలు, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు, కమాండర్ల మధ్య వేగవంతమైన సమన్వయంపై ఆధారపడి ఉంటాయని చెప్పారు. అందుకే భారత సైన్యాన్ని మరింత చురుకైన, నెట్‌వర్క్ ఆధారిత, సాంకేతికతతో కూడిన దళాలుగా తీర్చిదిద్దుతున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో ఆల్ ఆర్మ్స్ రుద్ర బ్రిగేడ్లు, లైట్ క్విక్ రెస్పాన్స్ భైరవ బెటాలియన్లు, అశని డ్రోన్ ప్లాటూన్లు, శక్తిబాణ్ రెజిమెంట్లు, దివ్యాస్త్ర బ్యాటరీలు వంటి కొత్త విభాగాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వీటి ద్వారా సైన్యం మరింత వేగంగా స్పందించేలా, లక్ష్యాలను అత్యంత ఖచ్చితంగా ఛేదించేలా, సాంకేతిక యుద్ధాలకు పూర్తిస్థాయిలో సిద్ధమయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
వివరాలు
డ్రోన్ల విషయంలో సంఖ్య కంటే సామర్థ్యానికే భారత సైన్యం ఎక్కువ ప్రాధాన్యం
డ్రోన్ల వినియోగానికి భారత సైన్యం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని ద్వివేది తెలిపారు. డ్రోన్లు కేవలం నిఘా కోసమే కాకుండా గూఢచారి సమాచారం సేకరణ,లక్ష్యాల గుర్తింపు, ఖచ్చితమైన దాడులు, సరఫరా నిర్వహణ,యుద్ధ నష్టాల అంచనా,సైనికుల రక్షణ వంటి అనేక కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నాయని చెప్పారు. డ్రోన్ల విషయంలో సంఖ్య కంటే సామర్థ్యానికే భారత సైన్యం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందని ఆయన అన్నారు. చిన్న వ్యూహాత్మక కార్యకలాపాల నుంచి సుదూర నిఘా,సరఫరా,కచ్చితమైన దాడుల వరకు వేర్వేరు అవసరాలకు వేర్వేరు రకాల డ్రోన్లు అవసరమవుతాయని వివరించారు. దేశీయ తయారీ,శిక్షణ పొందిన సిబ్బంది,నిర్వహణ వ్యవస్థ, శిక్షణ మౌలిక వసతులు,యుద్ధ సిద్ధాంతాలు, యాంటీ డ్రోన్ సామర్థ్యాలు, కార్యాచరణ ప్రణాళికలతో సమన్వయం వంటి అంశాలపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.