Operation Sindoor: 'ఆపరేషన్ సిందూర్'.. 25 నిమిషాల్లోనే ఖేల్ ఖతం.. దుకాణ్ బంద్..వెల్లడించిన సైన్యం
ఈ వార్తాకథనం ఏంటి
భారత సైన్యం ఇటీవల పాకిస్థాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) ప్రాంతాల్లో తొమ్మిది ఉగ్ర స్థావరాలపై మెరుపుదాడులు చేసింది.
ఈ దాడులు అర్ధరాత్రి రాఫెల్ యుద్ధవిమానాలతో ప్రణాళికబద్ధంగా చేపట్టారు.
భారత్ అత్యంత నిగూఢంగా వ్యవహరించి,కేవలం ఉగ్రవాద స్థావరాలపైనే ఈ దాడులను జరిపింది.
ఈ దాడులపై కేంద్ర విదేశాంగ శాఖ,రక్షణ శాఖలు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించాయి.
ఈ సందర్భంగా విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మాట్లాడుతూ,సరిహద్దు ఉగ్రవాద చర్యల్లో ఇప్పటి వరకు 350మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్లు,800 మంది గాయపడినట్లు తెలిపారు.
అదే సమయంలో, 600మంది సైనికులు మృతి చెందగా,మరో 1400మంది సైనికులు గాయపడ్డారని వెల్లడించారు.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు 'ఆపరేషన్ సిందూర్'ను అమలు చేశామని చెప్పారు.
వివరాలు
ఉగ్ర దాడులు జరిగే అవకాశం ఉందని నిఘా సంస్థలు హెచ్చరికలు
పహల్గామ్ ఉగ్రదాడికి 'ది రెసిస్టెన్స్ ఫోర్స్ (TRF)' అనే సంస్థ బాధ్యత వహించినట్లు తెలిపారు.
ఈ సంస్థ పాకిస్తాన్‌లోని ఇతర ఉగ్రవాద సంస్థల కోసం పనిచేస్తోందని,ముఖ్యంగా లష్కరే తోయిబా (LET) ఉగ్రదాడులను భారత్‌లో కొనసాగించడానికి TRFను ఉపయోగిస్తున్నారని అన్నారు.
భారత నిఘా సంస్థలు ఈ దాడుల వెనుక ఉన్న ఉగ్రవాదులను గుర్తించినట్లు చెప్పారు.
అంతర్జాతీయ వేదికలపై పాక్ గందరగోళాన్ని సృష్టిస్తూ తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తోందని పేర్కొన్నారు.
భవిష్యత్తులో భారత్‌పై మరోసారి ఉగ్ర దాడులు జరిగే అవకాశం ఉందని నిఘా సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయని తెలిపారు.
ఈ క్రమంలోనే ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడం లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్ చేపట్టారని వివరించారు.
వివరాలు
కేవలం 25 నిమిషాల వ్యవధిలోనే తొమ్మిది ఉగ్రవాద స్థావరాల ధ్వంసం
ఇండియన్ ఆర్మీ లెఫ్టినెంట్ కర్నల్ సోఫియా ఖురేషి మాట్లాడుతూ, ఆపరేషన్ సిందూర్ అర్ధరాత్రి 1:05 నిమిషాలకు ప్రారంభమై 1:30 నిమిషాలకు ముగిసిందని తెలిపారు.
కేవలం 25 నిమిషాల వ్యవధిలోనే తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను విజయవంతంగా ధ్వంసం చేశామని చెప్పారు.
ఈ దాడుల్లో పాకిస్తాన్ ఆక్రమిత ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాదులను ప్రవేశపెట్టే కేంద్రాలు,శిక్షణ శిబిరాలు లాంటి ప్రధాన టార్గెట్లపై దాడులు జరిగాయని తెలిపారు.
ముంబై దాడుల్లో నిందితుడైన అజ్మల్ కసబ్ కూడా ఇలాంటే శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందాడని గుర్తుచేశారు. ఖచ్చితమైన నిఘా సమాచారం ఆధారంగా ఈ దాడులు చేపట్టామన్నారు.
వివరాలు
హల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన.. కుటుంబాలకు న్యాయం
వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్ మాట్లాడుతూ,పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయినవారికి, వారి కుటుంబాలకు న్యాయం చేయడం కోసం భారత సాయుధ దళాలు ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించాయని తెలిపారు.
తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని, విజయవంతంగా తుదముట్టించామని చెప్పారు.
ఈ దాడుల్లో పౌరుల ప్రాణాలకు హాని కలగకుండా, మౌలిక వసతులకు నష్టం కలగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నామని వివరించారు.