
Tamil Nādu Politics: తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎన్డీయేకు పన్నీర్ సెల్వం గుడ్‌బై
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడు రాజకీయాల్లో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం (ఓ.పి.ఎస్) నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) నుంచి వైదొలగుతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు మాజీ మంత్రి, సెల్వంకు నమ్మినబంటు రామచంద్రన్ ప్రకటించారు.ఆ సమయంలో పన్నీర్ సెల్వం కూడా అతడి పక్కననే ఉండడం గమనార్హం. ఈ కీలక పరిణామానికి ముందు మార్నింగ్ వాక్ సందర్భంగా పన్నీర్ సెల్వం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలిశారు. ఆ భేటీలో పలు అంశాలపై ఇద్దరూ చర్చించినట్టు సమాచారం. అదే సమయంలో ఎన్డీయే కూటమి నుంచి వైదొలగనున్నట్టు ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇకపై ఎన్డీయేతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
వివరాలు
టీవీకే పార్టీతో ఓ.పి.ఎస్ చేతులు కలపవచ్చని ప్రచారం
ఇదిలా ఉండగా, 2026 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేపట్టనున్నట్టు పన్నీర్ సెల్వం ప్రకటించారు. ప్రస్తుతం పొత్తుల అంశాన్ని ప్రస్తావించాల్సిన సమయం కాదని, ఎన్నికల సమయం దగ్గరపడినప్పుడు ఆ అంశాన్ని మాట్లాడతామని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా, ఇటీవల సినీనటుడు విజయ్ స్థాపించిన 'తమిళ వెట్రి కళగ' (టీవీకే) పార్టీతో ఓ.పి.ఎస్ చేతులు కలపవచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై మీడియా ప్రశ్నించినప్పటికీ.. కాలమే ఈ విషయాన్ని తేలుస్తుందని పన్నీర్ సెల్వం సమాధానాన్ని దాటవేశారు.
వివరాలు
రాజకీయాల్లో తీవ్ర చర్చ
గతంలో పన్నీర్ సెల్వం అన్నాడీఎంకేలో కీలక నేతగా, ఎన్డీయే కూటమిలో కీలక పాత్రధారిగా వ్యవహరించారు. అయితే పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాల కారణంగా ఆయన బహిష్కరణకు గురై, తాను నేతృత్వం వహించే వేరు వర్గాన్ని అభివృద్ధి చేసుకున్నారు. ఇప్పుడు ఎన్డీయే నుంచి కూడా వైదొలగిన ఆయన నిర్ణయం, 2026 అసెంబ్లీ ఎన్నికల ముంగిట తమిళ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.