
Malegaon blast case: ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్‌ను అరెస్టు చేయాలని అప్పట్లో ఆదేశాలు : మాజీ పోలీసు అధికారి
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా కలకలం రేపిన 2008 మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో నిందితులైన వారిని ముంబైలోని ప్రత్యేక కోర్టు ఇటీవల నిర్దోషులుగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో, అప్పట్లో ఈ కేసు దర్యాప్తులో భాగంగా పనిచేసిన మాజీ ఏటీఎస్ అధికారి మహబూబ్ ముజావ్ ఒక సంచలనాత్మక వ్యాఖ్య చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భాగవత్‌ను అరెస్టు చేయాలన్న ఆదేశాలు తనకు అప్పట్లో వచ్చాయని ఆయన తెలిపారు. ఒక ప్రముఖ వార్తాసంస్థతో శుక్రవారం ముజావ్ మాట్లాడారు.అప్పట్లో కేసు దర్యాప్తు జరుగుతున్న సమయంలో,తనకు కొందరిని అరెస్టు చేయాలన్న ఆదేశాలు వచ్చినట్టు వెల్లడించారు. ఆ పట్టికలో రామ్ కల్సంగ్రా,సందీప్ దాంగే,దిలీప్ పాటిదార్ తోపాటు,ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేరు కూడా ఉందని చెప్పారు.
వివరాలు
రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుమారు పది మంది సిబ్బంది
అటువంటి స్థాయిలో ఉన్న వ్యక్తిని అరెస్టు చేయడం తన అధికార పరిధిని మించిన విషయమని అన్నారు. ఈ ఆదేశాలను అప్పటి ఏటీఎస్ చీఫ్ పరమ్‌బీర్ సింగ్‌తోపాటు మరికొందరు ఉన్నతాధికారులు అందించారని ముజావ్ వివరించారు. అధికారుల సూచన మేరకు తనకు సహకారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుమారు పది మంది సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. అంతేగాక, తనకు అవసరమైన నిధులను సమకూర్చడం మాత్రమే కాదు, అధికారికంగా ఓ రివాల్వర్‌ను కూడా అప్పట్లో జారీ చేశారన్నారు. అయితే, ఆ ఉన్నతాధికారుల ఆదేశాలకు తాను అనుకూలంగా స్పందించకపోవడంతో తనపై తప్పుడు కేసులు పెట్టారని ముజావ్ ఆరోపించారు. వాటి నుంచి చివరికి తాను పూర్తిగా నిర్దోషిగా బయటపడినట్టు పేర్కొన్నారు.
వివరాలు
నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించిన ప్రత్యేక కోర్టు
మాలేగావ్ పట్టణంలో ఈ బాంబు పేలుడు జరిగింది. ఓ మసీదు సమీపంలో పార్క్ చేసి ఉంచిన మోటార్ సైకిల్‌లో బాంబు అమర్చి ఉగ్రవాదులు పేల్చిన ఘటనలో మొత్తం ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా,100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతకు కారణమైంది. ఈ కేసులో పోలీసులు పలు కీలక వ్యక్తులపై ప్రధాన నిందితులుగా కేసు నమోదు చేశారు. వారిలో బీజేపీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, లెఫ్టినెంట్ కర్నల్ శ్రీకాంత్ పురోహిత్, రమేశ్ ఉపాధ్యాయ్, అజయ్ రహీర్‌కార్, సుధాకర్ ద్వివేది, సుధాకర్ చతుర్వేది, సమీర్ కులకర్ణిల పేర్లు ఉన్నాయి. ఈ కేసులో ముంబయిలోని ప్రత్యేక కోర్టు గురువారం విచారణ జరిపి, అందరు నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది.