
New Osmania Hospital: నూతన ఉస్మానియా ఆసుపత్రి భవన నిర్మాణ పనులు ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవన నిర్మాణ పనులు అధికారికంగా మొదలయ్యాయి. హైదరాబాద్‌లోని గోషామహల్ స్టేడియంలో నిర్మించ తలపెట్టిన ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనాల నిర్మాణానికి పునాది రాయి వేశారు. దసరా వేడుకల సందర్భంలో ఎంఈఐఎల్ డైరెక్టర్ కె. గోవర్ధన్ రెడ్డి ఈ పునాది కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి, నిర్మాణానికి శుభారంభం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్ణయించిన కాల పరిమితిలో భవన నిర్మాణాన్ని పూర్తిచేయడానికి ప్రభుత్వం కట్టుబడ్డదని తెలిపారు. 26 ఎకరాల విస్తీర్ణంలో ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనాల నిర్మాణ పనులకు ఈ ఏడాది జనవరి 31న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.
వివరాలు
12 అంతస్తులతో 2 వేల పడకలు
ఈ ప్రాజెక్టులో భాగంగా 12 అంతస్తులతో 2 వేల పడకలతో అత్యాధునిక సౌకర్యాలతో ఈ భవనాలను నిర్మించబోతున్నారు. భవనానికి రెండు అంతస్తుల బేస్‌మెంట్ పార్కింగ్ సౌకర్యంతో రూపొందించబడుతుంది. ఈ నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కొత్త ఉస్మానియా ఆసుపత్రిలో 29 మేజర్ ఆపరేషన్ థియేటర్లు, 12 మైనర్ ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటుచేయబడి, హెలిప్యాడ్ సౌకర్యం కూడా అందించబడనుంది. అంతేకాక, రోబోటిక్ సర్జరీ, అవయవ ప్రతిస్థాపన (ట్రాన్స్ ప్లాంట్) థియేటర్లు, మురగునీటి శుద్ధి ప్లాంట్లు, బయోమెడికల్ వ్యర్థ నిర్వహణ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
వివరాలు
నర్సింగ్, డెంటల్, ఫిజియోథెరపీ విభాగాల కోసం ప్రత్యేక కళాశాలలు
అలాగే, నర్సింగ్, డెంటల్, ఫిజియోథెరపీ విభాగాల కోసం ప్రత్యేక కళాశాలలను కూడా నిర్మించనున్నారు. ఈ నిర్మాణాలు పూర్తయ్యిన తరువాత, నగర ప్రజలకు వైద్య సౌకర్యాల్లో విశేష మార్పు, పెద్ద ఊరట లభించడం ఖాయం.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
గోషామహల్ స్టేడియంలో నూతన ఆసుపత్రి భవన నిర్మాణం
నూతన ఉస్మానియా ఆసుపత్రి భవన నిర్మాణ పనులు ప్రారంభం
— DD News Telangana | తెలంగాణ న్యూస్ (@ddyadagirinews) October 2, 2025
✅ గోషామహల్ స్టేడియంలో నూతన ఆసుపత్రి భవన నిర్మాణం
✅ 26 ఎకరాల్లో, 12 అంతస్తుల్లో, 2000 పడకలు
✅ జనవరి 31న CM @revanth_anumula శంఖుస్థాపన
✅ ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా రెండేళ్లలో నిర్మాణం పూర్తి#OsmaniaHospital pic.twitter.com/SogETmBA9b