Page Loader
Osmania Hospital: నేడు ఉస్మానియా ఆసుపత్రికి సీఎం భూమిపూజ.. నూతన ఆసుపత్రి విశేషాలు ఇవే..
నేడు ఉస్మానియా ఆసుపత్రికి సీఎం భూమిపూజ.. నూతన ఆసుపత్రి విశేషాలు ఇవే..

Osmania Hospital: నేడు ఉస్మానియా ఆసుపత్రికి సీఎం భూమిపూజ.. నూతన ఆసుపత్రి విశేషాలు ఇవే..

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 31, 2025
12:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

నిత్యం వేల సంఖ్యలో ఓపీ (OP), వందలాది మంది ఇన్‌పేషెంట్‌లు ఉండే ఉస్మానియా ఆసుపత్రి ఎప్పుడూ సందడిగా ఉంటుంది. ఈ ఆసుపత్రిలో 22 విభాగాలు, ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీలు వంటి ఆధునిక వైద్య సేవలు అందించబడుతున్నా, గడిచిన అనేక సంవత్సరాలుగా ఈ ఆసుపత్రికి జబ్బు చేసినా పట్టించుకున్న నాథుడు లేడు. సరిపడా బెడ్స్, ఆపరేషన్‌ థియేటర్స్ లేమితో పాటు, ఎప్పుడూ ఏదో సమస్యతో కునారిల్లుతున్నా పాలకులకు పెద్దగా పట్టించుకున్నది లేదు. దాదాపు పది సంవత్సరాల క్రితం పాత భవనం పెచ్చులాడి, అది మూసివేయాల్సి వచ్చింది.

వివరాలు 

ఆసుపత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన

ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో బెడ్స్ కొరత, ఇబ్బందుల దుస్థితి కనిపిస్తోంది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కొత్త భవనం నిర్మిస్తామని ప్రకటించినప్పటికీ, కోర్టు కేసుల నేపథ్యంలో అది ముందుకు సాగలేదు. తాజాగా, రేవంత్ రెడ్డి సర్కారు ఉస్మానియా ఆసుపత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనుంది. ఈ కార్యక్రమం ఈ రోజు ఉదయం 11:30 గంటలకు గోషామహల్ ప్రాంతంలో ప్రారంభం కానుంది. సుమారు 1000 మంది అధికారులు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలుస్తోంది.

వివరాలు 

ఉస్మానియా ఆసుపత్రి చరిత్ర: 

1919లో, చివరి నిజాం, మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఉస్మానియా ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ ఆసుపత్రి 22 విభాగాల్లో వైద్య సేవలు అందిస్తోంది, ఇందులో 1096 పడకలు ఉన్నాయి. బ్లడ్ బ్యాంక్‌, స్కిన్ బ్యాంక్, డయాబెటిక్ ఫూట్ కేర్ క్లినిక్, ట్రాన్స్‌జెండర్ క్లినిక్, కాలిన గాయాల చికిత్స వంటి సేవలు అందించడంలో ఈ ఆసుపత్రి విశిష్టత. ప్రతి రోజు 2 వేల మందికి పైగా ఓపీ సేవలు అందించబడుతున్నా, పడకల కొరత ఒక ప్రధాన సమస్య. ఈ నేపథ్యంలో, సర్కారు కొత్త భవనాన్ని ఆధునికతతో రూపొందించాలని భావిస్తోంది.

వివరాలు 

కొత్త ఆసుపత్రి నిర్మాణం: 

గోషామహల్‌లో సుమారు 3 ఎకరాల విస్తీర్ణంలో 14 అంతస్తుల కొత్త భవనం నిర్మించడానికి సర్కారు నిర్ణయించింది. రూ.2,075 కోట్లతో నిర్మించనున్న ఈ భవనంలో 2 వేల పడకలు అందుబాటులోకి రానున్నాయి. 22 విభాగాలకు మరో 8 విభాగాలు జోడించబడతాయి. ఆసుపత్రికి రోగులు, సిబ్బంది కోసం 2 ఫ్లోర్‌ల సెల్లార్‌లో పార్కింగ్ ఏర్పాటు చేయనుంది రోజూ 3 వేల నుండి 5 వేల మందికి సేవలు అందించేందుకు గ్రౌండ్ ఫ్లోర్‌లో ఓపీ కౌంటర్లు, వైద్య పరీక్షల కోసం అవసరమైన ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించింది.

వివరాలు 

అత్యాధునిక సౌకర్యాలు: 

ఆసుపత్రి గదులలో గాలి, వెలుతురు తగినంతగా ప్రవహించేలా ప్రత్యేకంగా నిర్మాణం చేపడతారు. ప్రతి విభాగంలో ఆపరేషన్ థియేటర్లు, పోస్ట్ ఆపరేటివ్ యూనిట్లు అందుబాటులోకి తీసుకురాబోతున్నాయి. అవయవ మార్పిడి కోసం అత్యాధునిక థియేటర్లను సిద్ధం చేయాలని యోచన చేస్తున్నట్లు తెలిపారు. 2026-27 నాటికి ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణం పూర్తి చేయాలని సర్కారు భావిస్తోంది. వచ్చే వందేళ్ల పాటు అత్యాధునిక సేవలు అందించేందుకు అనుగుణంగా హంగులను నిర్మించాలని ప్రణాళికతో ముందుకు సాగుతుంది. విశాలమైన రోడ్డు కనెక్టివిటీ, ఎయిర్ అంబులెన్స్ సేవల కోసం హెలిప్యాడ్లు, అంతర్జాతీయ సమావేశాలను నిర్వహించేందుకు సెమినార్ హాల్‌ను ఏర్పాటు చేయాలని వెల్లడించింది.