Revanth Reddy: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పూర్తి మా లక్ష్యం.. ఎన్ని అవాంతరాలైనా ఎదుర్కొంటాం: సీఎం రేవంత్ రెడ్డి
ఈ వార్తాకథనం ఏంటి
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులను పూర్తి చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రాధాన్యమైన లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా మన్నేవారిపల్లెలో పర్యటించిన సీఎం.. హెలీ మాగ్నటిక్ సర్వే కోసం సిద్ధంగా ఉన్న హెలికాప్టర్, ఆధునిక పరికరాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రాజెక్టు 1983లోనే మంజూరైంది. కానీ ఇప్పటికీ పూర్తికాకపోవడం చాలా బాధాకరమని అన్నారు. రేవంత్ వెల్లడించిన వివరాల ప్రకారం.. టన్నెల్ బోరింగ్ మిషన్ ద్వారా పనులు చేయడం సాంకేతికంగా కష్టతరమైందన్నారు. అయినప్పటికీ ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామన్నారు. ఈ ప్రాజెక్టును రాజకీయ లాభనష్టాల దృష్టితో చూడకూడదని, ప్రజలకు మేలు చేకూర్చే పనిని అడ్డుకోవడం తప్పని బీఆర్ఎస్ నాయకులపై విమర్శలు గుప్పించారు.
Details
30 కిలోమీటర్లు టన్నెల్ పూర్తి
"ప్రాజెక్టు ప్రారంభ సమయంలో అంచనా వ్యయం రూ.1,968 కోట్లు. రెండు దశాబ్దాలుగా ఈ పనులు సాగుతున్నాయి. తెలంగాణ ఏర్పాటుకల్లా 30 కిలోమీటర్ల టన్నెల్ పూర్తి అయ్యింది. కానీ కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లలో మిగిలిన 10 కిలోమీటర్ల పనిని కూడా పూర్తి చేయలేకపోయింది. పెద్దగా కమీషన్లు రాకపోవడంతో ఈ ప్రాజెక్టును పక్కన పెట్టారు. అదే సమయంలో ఏపీలో జగన్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు విస్తరణ పనులు చేపట్టింది, కానీ కేసీఆర్ మాత్రం చూసూ ఊరుకున్నారని సీఎం ఆరోపించారు. రూ.2 వేల కోట్లు ఖర్చు చేసి ఉంటే నల్గొండ జిల్లాల రైతులకు సాగునీరు అందేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదనే ఉద్దేశ్యంతో ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారు.
Details
గతంలో కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదు
కృష్ణానదిపై చేపట్టిన ప్రాజెక్టులన్నింటినీ కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదని రేవంత్ తెలిపారు. అంతేకాదు, గత పదేళ్లలో సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టర్లకు రూ.1.86 లక్షల కోట్లు చెల్లించగా, అందులో కాళేశ్వరం ప్రాజెక్ట్ కాంట్రాక్టర్లకే రూ.1.06 లక్షల కోట్లు వెళ్లినట్టు ఆయన వెల్లడించారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణానదిపై పలు ప్రాజెక్టులను పూర్తి చేసిందని, కానీ తెలంగాణలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తికాలేదని రేవంత్‌రెడ్డి విమర్శించారు.