Scrub Typhus: ఏపీలో పెరుగుతున్న 'స్క్రబ్ టైఫస్' జ్వరాల కేసులు.. చిత్తూరు, కాకినాడ, విశాఖ జిల్లాల్లో అత్యధికం
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీలో స్క్రబ్ టైఫస్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ జ్వరం ప్రస్తుతం 26 జిల్లాలల్లో నమోదవుతోంది. స్క్రబ్ టైఫస్ అనేది నిజానికి చాలా చిన్న పరిమాణంలో ఉండే, నల్లిని పోలిన కీటకం ద్వారా వ్యాపించే ఇన్‌ఫెక్షన్. రికెట్సియా కుటుంబానికి చెందిన ఒరియంటియా సుట్సుగముషి అనే బ్యాక్టీరియా ఈ వ్యాధికి కారణం. కీటకం కుడితే శరీరంపై నల్లని మచ్చలు, దద్దుర్లు మొదట కనిపిస్తాయి. వాటి తర్వాత వారం నుంచి పది రోజుల్లో జ్వరం, వణుకు, తలనొప్పి, కండరాల నొప్పులు, జీర్ణ సమస్యలు వంటి లక్షణాలు బయటపడతాయి. సమయానికి చికిత్స అందకపోతే తీవ్రమైన శ్వాస ఇబ్బందులు (ఏఆర్‌డీఎస్), మెదడు-వెన్నెముక ఇన్‌ఫెక్షన్లు (మెనింజైటిస్), ఇంకా మూత్రపిండాల పనితీరు దెబ్బతినే అవకాశం ఉంది.
వివరాలు
ఏ జిల్లాల్లో ఎలా?
స్క్రబ్ టైఫస్ ఎక్కువగా కనిపిస్తున్న జిల్లాల్లో చిత్తూరు 379 కేసులతో ముందంజలో ఉంది. తరువాత కాకినాడలో 141,విశాఖపట్నంలో 123 కేసులు నమోదయ్యాయి. అదనంగా వైఎస్సార్ కడప (94),నెల్లూరు (86),అనంతపురం (68),తిరుపతి (64),విజయనగరం (59), కర్నూలు (42),అనకాపల్లి (41), శ్రీకాకుళం (34), అన్నమయ్య (32), గుంటూరు (31), నంద్యాల (30) జిల్లాల్లో కూడా ఇన్‌ఫెక్షన్లు వెలుగుచూశాయి. ఈ వ్యాధిని సాధారణ యాంటీబయాటిక్స్‌తో నయం చేయవచ్చు. కానీ లక్షణాలను గుర్తించడంలో జాప్యం, అవగాహన లోపం వల్ల సమస్య పెద్దదవుతోంది. చాలా మంది జ్వరం తగ్గకపోతే ముందుగా మలేరియా, టైఫాయిడ్, డెంగీ పరీక్షలు చేయించుకుంటున్నారు. అయితే శరీరంపై నల్లని మచ్చలు, దద్దుర్లు ఉన్నపుడు ఆలస్యం చేయకుండా స్క్రబ్ టైఫస్ కోసం ఎలిసా పరీక్ష చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
వివరాలు
పరీక్షలు అందుబాటులో ఉంటే…
సమయానికి చికిత్స అందితే స్క్రబ్ టైఫస్ మరణాల రేటు 2% కన్నా తక్కువగా ఉంటుంది. కానీ చికిత్సలో ఆలస్యం చేస్తే పరిస్థితి తీవ్రంగా మారి,రోగి కోమాలోకి వెళ్లే ప్రమాదమూ, 6% నుంచి 30% వరకు మరణాల అవకాశమూ ఉంటుంది. రాష్ట్రంలో ఈ వ్యాధిని గుర్తించే పరీక్షలు కేవలం కొద్ది ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఉండటంతో చాలా కేసులు బయటపడట్లేదు. ప్రస్తుతం విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి వంటి ప్రధాన కేంద్రాల్లో మాత్రమే ఈ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. పైగా పబ్లిక్ హెల్త్ ల్యాబ్‌లు 17జిల్లాల్లోనే ఉండడంతో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కేసులు గుర్తించడం కష్టమవుతోంది. అందుకే గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి నమూనాలు సేకరిస్తే కేసులు త్వరగా బయటపడతాయని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.
వివరాలు
వచ్చే ఆరు నెలలు ప్రత్యేక జాగ్రత్త
స్క్రబ్ టైఫస్ కీటకాల కార్యకలాపాలు ఆగస్టు నుంచి ఫిబ్రవరి వరకు ఎక్కువగా ఉంటాయి. ఈ కాలంలో ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం అధికంగా ఉండటంతో అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఈ వ్యాధి మనుషుల ద్వారా మరొకరికి సోకదు. అయితే కీటకం కాటు తగలడం వల్లే సమస్య వస్తుంది కనుక రక్షణ చర్యలు తప్పనిసరి.
వివరాలు
జాగ్రత్తలు:
తడి నేల, పొదలు, తోటలు, పొలాలు, పశువుల పాకలు, చెత్త పేరుకుపోయే ప్రదేశాల్లో పనిచేసేవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. పూర్తిగా చేతులు కప్పే చొక్కా, ప్యాంట్, సాక్సులు, బూట్లు తప్పనిసరిగా ధరించాలి. ఇళ్లలో పాత మంచాలు, పరుపులు, దిండ్లలో ఈ కీటకాలు చొరబడే అవకాశం ఉండటంతో వాటిని మార్చడం లేదా పూర్తిగా శుభ్రం చేసిన తర్వాతే వాడడం మంచిది. పిల్లలకు ప్రమాదం ఎక్కువగా ఉండేందున, వాళ్లకు శరీరం కప్పే దుస్తులు వేసి ఆరుబయట ఆడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. రాష్ట్రంలో 'స్క్రబ్ టైఫస్' తీవ్రత ఇలా.. (జనవరి 1 నుంచి నవంబర్ 26 వరకు) అనుమానిత కేసులకు పరీక్షలు: 6,678 గుర్తించిన పాజిటివ్ కేసులు : 1,317