
Maharashtra Cyber: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత.. 10లక్షలకు పైగా సైబర్ దాడులు
ఈ వార్తాకథనం ఏంటి
పహల్గాం ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ సంఘటన అనంతరం భారత్‌లో సైబర్ దాడులు భారీగా పెరిగినట్లు మహారాష్ట్ర సైబర్ విభాగం వెల్లడించింది.
తాజా లెక్కల ప్రకారం, దేశవ్యాప్తంగా దాదాపు పది లక్షల డిజిటల్ దాడులు నమోదయ్యాయి.
ఈ దాడుల వెనుక పాకిస్థాన్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన హ్యాకింగ్ గుంపులు ఉన్నట్లు గుర్తించారు.
ఏప్రిల్ 22 తర్వాత డిజిటల్ దాడుల తీవ్రత గణనీయంగా పెరిగిందని అధికారులు తెలిపారు.
భారతదేశంలోని వివిధ వెబ్‌సైట్లు, అధికారిక పోర్టళ్లు ప్రధాన లక్ష్యంగా మారాయని పేర్కొన్నారు.
ముఖ్యంగా పశ్చిమాసియా, ఇండోనేషియా, మొరాకో దేశాల హ్యాకర్లు ఈ సైబర్ దాడుల్లో పాల్గొన్నారని వివరించారు.
వివరాలు
పాక్ దౌత్య సంబంధాల విషయంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయాలు
ఏప్రిల్ 22న పహల్గాం వద్ద పర్యాటకులపై ఉగ్రవాదులు నిర్వహించిన దారుణ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి విదితమే.
ఈ హీన చర్య దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదనను రేకెత్తించింది. ఈ దాడితో భారతదేశం, పాకిస్థాన్‌ల మధ్య ఇప్పటికే ఉద్రిక్తతలు మరింత తీవ్రస్థాయికి చేరుకున్నాయి.
దీనితో, పాకిస్థాన్‌తో ఉన్న దౌత్య సంబంధాల విషయంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
సింధూ నదుల ఒప్పందాన్ని తాత్కాలికంగా అమలు నిలిపివేయడంతో పాటు, భారత్‌లో ఉన్న పాకిస్థాన్ పౌరులు తక్షణమే దేశాన్ని విడిచి వెళ్లాలంటూ ఆదేశించింది.
ఈ చర్యల నేపథ్యంలో పాకిస్థాన్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ వివిధ వేదికలపై విమర్శలు గుప్పిస్తోంది.