బైక్ ట్యాక్సీలకు వ్యతిరేకంగా బెంగళూరులో రోడ్లపై 2 లక్షలకు పైగా నిలిచిపోయిన ఆటోలు
బెంగళూరులో బైక్ ట్యాక్సీ సేవలను నిరసిస్తూ సోమవారం ఆటోరిక్షా డ్రైవర్లు సమ్మె చేస్తున్నారు. బెంగుళూరు ఆటో డ్రైవర్స్ యూనియన్స్ ఫెడరేషన్ రాపిడో, ఇతర బైక్ టాక్సీ సర్వీసులు నగరంలో చట్టవిరుద్ధంగా నడుస్తున్నాయని పేర్కొంది. ఒకరోజు సమ్మె సందర్భంగా అర్ధరాత్రి వరకు రెండు లక్షలకు పైగా ఆటోరిక్షాలు రోడ్డెక్కనున్నాయి. వీళ్ళు బెంగుళూరు సిటీ రైల్వే స్టేషన్ నుండి ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఇంటికి వరకు మార్చ్ చేస్తారు. బైక్ ట్యాక్సీలను నిషేధించాలని కార్మిక సంఘాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి 24 గంటల సమ్మె నిర్వహిస్తామని, నగరంలో అక్రమంగా నిర్వహిస్తున్న బైక్ ట్యాక్సీలకు వ్యతిరేకంగా మా ఆందోళన అని ఆదర్శ్ ఆటో, ట్యాక్సీ డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడు ఎం.మంజునాథ్ తెలిపారు
సమ్మె అదనుగా 3కి.మీ.లకు సింగిల్ ప్యాసింజర్‌కు 200 వసూలు చేస్తున్న డ్రైవర్లు
బైక్ ట్యాక్సీలకు వ్యతిరేకంగా 21 ఆటోరిక్షా డ్రైవర్ల సంఘాలు ఏకమయ్యాయని మంజునాథ్ తెలిపారు. అదే సమయంలో బెంగళూరులో నివసిస్తున్న ప్రజలు, సమ్మె కారణంగా ఆటోరిక్షా డ్రైవర్లు తక్కువ దూరాలకు అధిక ధరలు వసూలు చేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. విజయా బ్యాంక్ లేఅవుట్‌లో 6 మంది ప్రయాణికులతో తిరుగుతున్న ఆటోలు 3కి.మీ.లకు సింగిల్ ప్యాసింజర్‌కు 200 వసూలు చేస్తున్నారు. ఇది దోపిడీ అని ఒక ట్విటర్ యూజర్ ప్రశ్నించారు. బెంగళూరులో బైక్ టాక్సీ సేవలు కర్ణాటక ఎలక్ట్రిక్ బైక్ టాక్సీ స్కీమ్ 2021 కింద అనుమతించబడ్డాయి, ఇది కనెక్టివిటీని మెరుగుపరచడానికి, పర్యావరణ అనుకూల రవాణా పరిష్కారాలను ప్రోత్సహించడానికి ప్రారంభించబడింది.