Minister Ramprasad Reddy: 'స్త్రీశక్తి' కింద 40 కోట్ల ప్రయాణాలు..: రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి
ఈ వార్తాకథనం ఏంటి
రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న స్త్రీశక్తి పథకం కింద ఇప్పటివరకు మహిళలు సుమారు 40 కోట్ల సార్లు ఉచితంగా ప్రయాణించారు అని రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి వెల్లడించారు. ఈ పథకాన్ని ప్రభుత్వం భారంగా భావించకుండా,ఒక కీలక బాధ్యతగా తీసుకుని సమర్థంగా అమలు చేస్తోందన్నారు. పథకం విజయానికి వెనుక 48వేల మంది ఆర్టీసీ సిబ్బంది కష్టపాటు ఉందని ఆయన స్పష్టం చేశారు. టికెట్ల ఆదాయంపైనే ఆధారపడకుండా,కార్గో సేవల ద్వారా ఆర్టీసీ రూ.200 కోట్ల ఆదాయం సాధించిందని మంత్రి తెలిపారు. విజయవాడలోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో ఎండీ ద్వారకా తిరుమలరావుతో కలిసి బుధవారం స్త్రీశక్తి పథకంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్గో ఆదాయంలో ముందంజలో నిలిచిన జిల్లాల అధికారులకు ఈ సందర్భంగా ప్రశంసాపత్రాలు, నగదు బహుమతులు అందజేశారు.
వివరాలు
పల్లెవెలుగు సర్వీసుల్లోనూ ఏసీ సౌకర్యం
అనంతరం విజయవాడ బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన కార్గో సర్వీసుల నూతన భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ,త్వరలో రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని,అలాగే రెట్రోఫిట్‌మెంట్ బస్సులపై పరిశీలన కొనసాగుతోందని తెలిపారు. ఆధునిక సౌకర్యాలతో కూడిన విద్యుత్ బస్సులను ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇక పల్లెవెలుగు సర్వీసుల్లోనూ ఏసీ సౌకర్యం ఉండేలా అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని, ఆ దిశగా అన్ని చర్యలు చేపడుతున్నామని చెప్పారు. మహిళలు ఉచితంగా ప్రయాణించే విధంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఏసీ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి స్పష్టం చేశారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో పరిష్కారం కాని అనేక సమస్యలను ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా పరిష్కరిస్తోందని ఆయన తెలిపారు.