Ram Mohan Naidu: పశ్చిమాసియా సంక్షోభం దెబ్బ.. 4,335 భారతీయ విమానాలు సహా 5,500 రద్దు
ఈ వార్తాకథనం ఏంటి
ఇజ్రాయెల్-అమెరికా, ఇరాన్‌ల మధ్య జరుగుతున్న దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియా ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అగ్రరాజ్యాల సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్న చర్యల పేరుతో ఆ ప్రాంతంలోని కొన్ని దేశాలపై ఇరాన్ డ్రోన్లు, క్షిపణులు ప్రయోగిస్తోంది. ఈ పరిస్థితుల ప్రభావంతో భారత్ నుంచి ఇప్పటివరకు 5,500కుపైగా విమానాలు రద్దయ్యాయని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు రాజ్యసభలో వెల్లడించారు. వీటిలో భారతీయ విమానయాన సంస్థలకు చెందిన 4,335 విమానాలు ఉండగా, విదేశీ విమానయాన సంస్థలకు చెందిన 1,187 సర్వీసులు కూడా నిలిచిపోయినట్లు తెలిపారు.
వివరాలు
సంక్షోభ సమయంలో విమానయాన కార్యకలాపాల్లో భద్రతకే అత్యధిక ప్రాధాన్యం
పశ్చిమాసియాలో గగనతలాలను మూసివేయడం వల్లే ఈ స్థాయిలో విమాన సర్వీసులు రద్దయ్యాయని మంత్రి వివరించారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో విమానయాన కార్యకలాపాల్లో భద్రతకే అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. పరిస్థితులను పౌర విమానయానశాఖ, డీజీసీఏ నిరంతరం పరిశీలిస్తున్నాయని, అవకాశం ఉన్నప్పుడల్లా విమాన సర్వీసులను నడుపుతున్నామని తెలిపారు. ఈ చర్యలతో ఇప్పటివరకు దాదాపు 2.19 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చినట్లు వెల్లడించారు. అయితే ఇంకా కొన్ని గగనతలాలు మూసివేసి ఉన్నాయని, అవి తిరిగి అందుబాటులోకి వచ్చి భద్రతా పరిస్థితులు మెరుగుపడిన తర్వాతే విమాన రాకపోకలు పూర్తిగా సాధారణ స్థితికి చేరుకుంటాయని ప్రశ్నోత్తరాల సందర్భంగా రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.
వివరాలు
డిసెంబరులో ఇండిగో విమానాలు భారీ సంఖ్యలో రద్దు
ఇక గతేడాది డిసెంబరులో ఇండిగో విమానాలు భారీ సంఖ్యలో రద్దైన ఘటనపై కూడా మంత్రి స్పందించారు. ఆ సందర్భంలో ప్రయాణికులకు ట్రావెల్ కూపన్ల రూపంలో ఇప్పటికే రూ.163.92 కోట్ల పరిహారం అందించినట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా, ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందని చెప్పారు. అలాగే ప్రయాణికులకు మరింత పరిహారం అందేలా సంబంధిత విమానయాన సంస్థతో ప్రభుత్వం నిరంతరం చర్చలు జరుపుతోందని వెల్లడించారు.