Page Loader
Economic Survey: ఆర్థిక సర్వే కీలక వివరాలు.. 60 గంటల పనితో ఆరోగ్య సమస్యలు..! 
ఆర్థిక సర్వే కీలక వివరాలు.. 60 గంటల పనితో ఆరోగ్య సమస్యలు..!

Economic Survey: ఆర్థిక సర్వే కీలక వివరాలు.. 60 గంటల పనితో ఆరోగ్య సమస్యలు..! 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 31, 2025
07:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశ వ్యాప్తంగా ఉద్యోగుల పని గంటల పెంపు అంశంపై చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో, ఆర్థిక సర్వే (Economic Survey) కీలకమైన వివరాలను వెల్లడించింది. వారానికి 60 గంటలకు పైగా పని చేయడం ఆరోగ్య సమస్యలను తెచ్చిపెట్టే అవకాశం ఉందని ఈ సర్వే సూచిస్తోంది. రోజుకు 12 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం ఆఫీసులో గడిపే ఉద్యోగుల్లో మానసిక రుగ్మతలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఈ నివేదిక పేర్కొంది. సాధారణంగా, ఉత్పాదకతను పని గంటల ఆధారంగా కొలుస్తారు. అంటే, ఎక్కువ సమయం పని చేస్తే, ఎక్కువ ఫలితాలు లభిస్తాయని భావిస్తారు.

వివరాలు 

వారానికి 55-60 గంటలకుపైగా పని చేస్తే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం

అయితే, డబ్ల్యూహెచ్‌వో (WHO), ఐఎల్‌ఓ (ILO) వంటి సంస్థల అధ్యయనాల ప్రకారం, వారానికి 55-60 గంటలకుపైగా పని చేస్తే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇది మానసిక ఒత్తిడిని పెంచే అవకాశాన్ని కలిగిస్తుంది. 2024-25 ఆర్థిక సర్వే ఈ విషయాన్ని మరింత స్పష్టంగా వివరించింది. ఈ నేపథ్యంలో, మానవ మెదడు, మనస్సుపై సపియన్‌ ల్యాబ్స్‌ సంస్థ చేసిన పరిశోధనను కూడా ప్రస్తావించింది. రోజుకు 12 గంటలు లేదా అంతకంటే ఎక్కువ పని చేసే ఉద్యోగుల మానసిక స్థితి, సాధారణ పని గంటలున్నవారితో పోల్చితే 100 పాయింట్లు తక్కువగా ఉంటుందని పరిశోధన వెల్లడించింది.

వివరాలు 

 ఉద్యోగులు ఒత్తిడి తగ్గడానికి కుటుంబ సభ్యులు,బంధువులతో గడపాలి 

అదే విధంగా, కార్యాలయ వాతావరణం, సహోద్యోగులతో సంబంధాలు కూడా ఉత్పాదకతపై ప్రభావం చూపుతాయని ఆర్థిక సర్వే తెలియజేసింది. నెలకు కనీసం రెండు నుంచి మూడు రోజులు కుటుంబ సభ్యులు, బంధువులతో గడపడం ద్వారా ఉద్యోగులు ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. తద్వారా, మెరుగైన జీవనశైలి సాధ్యమవుతుందని నివేదిక పేర్కొంది. డబ్ల్యూహెచ్‌వో తెలిపిన వివరాల ప్రకారం, ఉద్యోగస్తులపై ఒత్తిడి, ఆందోళనలు ప్రపంచవ్యాప్తంగా భారీ నష్టానికి దారితీయగలవని ఆర్థిక సర్వే హెచ్చరించింది.

వివరాలు 

సుబ్రహ్మణ్యన్‌ వ్యాఖ్యలతో మొదలైన చర్చ 

ఎల్‌ అండ్‌ టీ ఛైర్మన్‌ ఎస్‌.ఎన్‌.సుబ్రహ్మణ్యన్‌ "ఉద్యోగులు వారానికి 90 గంటలు పని చేయాలి" అని వ్యాఖ్యలు చేసిన తర్వాత, దేశ వ్యాప్తంగా పని గంటలపై పెద్ద చర్చ ప్రారంభమైంది. పలువురు ఉద్యోగులు, పారిశ్రామిక వేత్తలు, సినీ ప్రముఖులు దీనిపై తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేశారు. కొంత కాలం తర్వాత, ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కూడా అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్ చేరాలంటే యువత వారానికి 70 గంటలు పని చేయాలన్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. పారిశ్రామికవేత్తలు, టెక్‌ కంపెనీల సీఈవోలు కూడా ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు వెల్లడించారు. ఈ తరహా వాదనలు అప్పుడప్పుడూ వినిపిస్తూనే ఉన్నాయి. అయితే, తాజా ఆర్థిక సర్వే ఈ విధమైన వ్యాఖ్యలను తిరస్కరించినట్లుగా కనిపిస్తోంది.