Uttarpradesh: రోగి నుంచి ఒక్క రూపాయి అధికంగా వసూలు.. ఉద్యోగి సస్పెండ్
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని మహారాజ్‌గంజ్ జిల్లా, జగదౌర్ గ్రామంలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ఓ రోగి నుంచి అదనంగా రూ.1 వసూలు చేశాడన్నఆరోపణలపై ఒక కాంట్రాక్ట్ ఉద్యోగిని విధుల నుంచి ప్రభుత్వం తొలగించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది నిర్లక్ష్యం చేస్తున్నారు అనే ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్న నేపథ్యంలో, సివ్వా ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు ప్రేమ్ సాగర్ పటేల్ సోమవారం జగదౌర్ గ్రామంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీల సమయంలో, ఓ రోగి ఫార్మసిస్ట్ తన వద్ద నుంచి రూ.1 అదనంగా వసూలు చేశాడని ఎమ్మెల్యే పటేల్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేసి,ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు
వెంటనే జిల్లా వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు స్పందించి,సదరు కాంట్రాక్ట్ ఉద్యోగిని విధుల నుంచి తొలగించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తాయి.అక్కడ రోగులకు మందులు రూ.1కే ఇవ్వబడతాయి. అయితే, సదరు కాంట్రాక్ట్ ఉద్యోగి రోగి నుంచి రూ.2 వసూలు చేశాడు. తనిఖీల సమయంలో,బీజేపీ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ పటేల్ ఆసుపత్రిలోని రోగులతో మాట్లాడారు. ఆసుపత్రిలో ప్రసూతి కేంద్రంలో రాత్రివేళల్లో మహిళా వైద్యులు అందుబాటులో లేకపోవడం, వైద్యులు రాసిన మందులు బయట కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉందని రోగులు, వారి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. ఈ అంశాలను జిల్లా వైద్యాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే పటేల్ తెలిపారు.