Oxfam report: దేశంలో కేవలం 1% ధనవంతుల చేతిలో 40శాతం సంపద
దేశంలోని ఆర్థిక అసమానతలపై అంతర్జాతీయ సంస్థ ఆక్స్‌ఫామ్ తన 'సర్వైవల్ ఆఫ్ ది రిచెస్ట్' నివేదికలో సంచలన విషయాలను వెల్లడించింది. 40శాతం సంపద కేవలం 1% ధనవంతుల చేతిలోనే ఉన్నట్లు పేర్కొంది. పేదల్లో సగం మంది వద్ద కేవలం 3శాతం సంపద ఉన్నట్లు వివరించింది. దావోస్‌లో 'ప్రపంచ ఆర్ధిక వేదిక' వార్షిక సమావేశం నేపథ్యంలో ఆక్స్‌ఫామ్ ఈనివేదికను విడుదల చేసింది. టాప్-10 ధనవంతులపై 5% పన్ను విధించడం వల్ల బడి మానేసిన పిల్లలందరికి విద్యను అందించడానికి డబ్బు సమకూరుతుందని పేర్కొంది. గౌతమ్ అదానీ 2017-21 మధ్య పెరిగిన లాభాలపై వన్-టైమ్ పన్ను విధించడం వల్ల రూ.1.79 లక్షల కోట్లను సమీకరించుకోవచ్చని, దీనిద్వారా ఏడాదిపాటు 50లక్షల మంది ప్రాథమిక ఉపాధ్యాయులకు వేతనాలు ఇవ్వొచ్చని చెప్పింది.
100 మంది ధనవంతుల సంపదతో 18నెలల కేంద్ర బడ్జెట్
భారతదేశంలోని బిలియనీర్లు వారి మొత్తం ఆస్తులపై ఒక్కసారి మాత్రమే 2% పన్ను విధించినట్లయితే రూ.40,423 కోట్లు సమకూరుతుందని, దీని ద్వారా రాబోయే మూడేళ్లలో దేశంలోని పిల్లలకు పోషకాహారం అందించవచ్చని ఆక్స్‌ఫామ్ నివేదిక చెప్పింది. దేశంలోని టాప్ 10 బిలియనీర్లపై ఒక్కసారిగా 5% పన్ను విధించడం వల్ల రూ. 1.37 లక్షల కోట్లు సమకూరుతుందని, ఈ మొత్తం 2022-2023లో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఆయుష్ మంత్రిత్వ శాఖ అంచనా వేసిన నిధుల కంటే 1.5 రెట్లు ఎక్కువని ఆక్స్‌ఫామ్ తెలిపింది. దేశంలోని 100 మంది ధనవంతుల సంపదతో 18నెలల కేంద్ర బడ్జెట్ ను సమకూర్చవచ్చని ఆక్స్‌ఫామ్ పేర్కొంది. ఈ వందమంది వద్ద దాదాపు రూ. 54లక్షల కోట్ల సంపద ఉన్నట్లు స్పష్టం చేసింది.