Acid Beetles: ఏపీలో ఆందోళన కలిగిస్తున్న యాసిడ్ పురుగులు.. చర్మంపై పాకితే తీవ్ర ఇబ్బందులు.. ఇవి ఎందుకు ప్రమాదకరం?
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల ఓ ప్రత్యేక రకం పురుగు ప్రజల్లో ఆందోళనకు కారణమవుతోంది. ముఖ్యంగా శరీరంపై ఈ పురుగు పాకిన వెంటనే చర్మంపై అలర్జీ, దద్దుర్లు, మంట, తీవ్రమైన దురద వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. రోజువారీ కూలి పనులు చేసే కార్మికులు ఈ పురుగుల కారణంగా తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా కడియపులంక ప్రాంతం మొక్కల నర్సరీలకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇక్కడ వేల సంఖ్యలో నర్సరీలు ఉండగా, ప్రతి రోజు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా మొక్కలను పంపిణీ చేస్తున్నారు. ఈ నర్సరీలపై ఆధారపడి సుమారు 50 వేల మంది శ్రామికులు జీవనోపాధి పొందుతున్నారు. ఇటీవల వర్షాలు కురుస్తుండటంతో మొక్కలు డిమాండ్ పెరిగి, ఎగుమతులు కూడా అధికమయ్యాయి.
వివరాలు
నర్సరీ కార్మికులకు కొత్త సమస్య..
అయితే ప్రస్తుతం నర్సరీల్లో పనిచేస్తున్న కార్మికులకు యాసిడ్ పురుగులు కొత్త సమస్యగా మారాయి. మొక్కలను ఏరడం, కదిలించడం లేదా తరలించే సమయంలో ఈ పురుగులు కార్మికుల శరీరంపైకి చేరుతున్నాయి. దీంతో చర్మంపై ఎర్రటి దద్దుర్లు, మంట, తీవ్రమైన దురద వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. చీమను పోలి పొడవుగా కనిపించే ఈ పురుగులను శాస్త్రీయంగా పెడిరోవ్ బీటిల్స్ (Paederus Beetles) అని పిలుస్తారు. సాధారణంగా యాసిడ్ పురుగులు అనే పేరుతో ఎక్కువగా గుర్తిస్తారు. ఈ పురుగు శరీరంపై పాకినప్పుడు భయంతో నలిపేస్తే, దాని తోక భాగంలో ఉండే పెడిరిన్ (Pederin) అనే విషపదార్థం బయటకు విడుదల అవుతుంది. అదే చర్మాన్ని తాకడం వల్ల అలర్జీ, మంట, దద్దుర్లు వంటి సమస్యలు ఏర్పడతాయి.
వివరాలు
అత్యంత జాగ్రత్తగా ఉండాలని వైద్యుల సూచన..
ఈ పురుగులు పొరపాటున కంటిలోకి వెళ్లకుండా అత్యంత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. పెడిరిన్ కంటి భాగాన్ని తాకితే తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని, కొన్ని సందర్భాల్లో చూపు దెబ్బతినే ప్రమాదం కూడా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితిని వైద్యపరంగా నైరోబీ-ఐ (Nairobi Eye) అని పిలుస్తారు. ఒకవేళ ఈ పురుగు శరీరంపై పాకినా లేదా నలిపిన ప్రాంతంలో దాని ద్రవం తగిలినా వెంటనే సబ్బుతో ఆ ప్రాంతాన్ని శుభ్రంగా కడిగి, మంచినీటితో శుభ్రం చేయాలి. ప్రభావిత ప్రాంతాన్ని గోకడం, రుద్దడం వంటి చర్యలు చేయకూడదు. అలర్జీ లేదా మంట ఎక్కువగా ఉంటే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించి, ఆయన సూచించిన మందులనే ఉపయోగించాలి.