Violation of Pakistan: బరితెగించిన పాకిస్థాన్.. సరిహద్దులో కాల్పులు
సరిహద్దులో పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూలోని అక్నూర్ ప్రాంతంలో సరిహద్దు వెంబడి భారత బలగాలు లక్ష్యంగా బుధవారం తెల్లవారుజామున పాక్ సైన్యం కాల్పులకు దిగింది. ఈ కాల్పుల్లో బీఎస్ఎఫ్ జవాన్ ఒకరు గాయపడినట్లు తెలిసింది. ఇక పాక్ కాల్పులను భారత సైన్యం ధీటుగా బదులిచ్చింది. ఈ కాల్పుల సంఘటన నేపథ్యంలో, సరిహద్దు వెంబడి భద్రతా దళాలు అప్రమత్తంగా ఉండి, గట్టి నిఘాను ఉంచుతున్నాయి.
ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేసిన అధికారులు
అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తును చేపట్టినట్లు అధికారులు తెలిపారు. భారత్, పాక్ 2021 ఫిబ్రవరిలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరుద్ధరించినప్పటి నుంచి ఇలాంటి కాల్పుల ఉల్లంఘనలు చాలా అరుదుగా జరుగుతున్నాయి. అయితే, గతేడాది రామ్‌గఢ్ సెక్టార్‌లో పాక్ రేంజర్స్ జరిపిన కాల్పుల్లో ఒక BSF జవాన్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. సెప్టెంబరు 18న మొదటి దశగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, తాజా కాల్పుల విరమణ ఉల్లంఘన చోటు చేసుకోవడం గమనార్హం.