JK: ఎల్‌ఓసీ వెంట పాక్ డ్రోన్ కవ్వింపు.. జమ్మూ కాశ్మీర్‌లో అప్రమత్తమైన భద్రతా దళాలు
ఈ వార్తాకథనం ఏంటి
దాయాది దేశం పాకిస్థాన్ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. జమ్ముకశ్మీర్‌లో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ)సమీపంలో ఒకేసారి పలు డ్రోన్ చొరబాటు ప్రయత్నాలు జరిగినట్లు సమాచారం. రాజౌరి జిల్లాలోని ఎల్‌ఓసీ వెంబడి నౌషెరా సెక్టార్‌ను పర్యవేక్షిస్తున్న భారత సైన్యం... గనియా-కల్సియన్ గ్రామం పరిసరాల్లో డ్రోన్ కదలికను గమనించి వెంటనే లైట్ మెషిన్ గన్‌లతో కాల్పులు జరిపింది. సాంబా,రాజౌరి,పూంచ్ జిల్లాల్లోని అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ),నియంత్రణ రేఖ వెంబడి ఉన్న అనేక ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం అనుమానాస్పద డ్రోన్‌ల కదలికలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఎగిరే వస్తువులన్నీ పాకిస్థాన్ వైపు నుంచి వచ్చినవేనని,కొన్ని నిమిషాల పాటు భారత భూభాగంపై సంచరించినట్లు వెల్లడించారు. డ్రోన్ కార్యకలాపాలు కనిపించగానే భద్రతా దళాలు అప్రమత్తమై వెంటనే ఆపరేషన్ ప్రారంభించినట్లు పేర్కొన్నారు.
వివరాలు
మీడియం,లైట్ మెషిన్ గన్‌లతో కాల్పులు
రాజౌరి జిల్లాలోని నౌషెరా సెక్టార్‌లో సాయంత్రం 6.35 గంటల సమయంలో గనియా-కల్సియన్ గ్రామం మీద డ్రోన్ కదలికను తొలిసారిగా సైనికులు గమనించారు. దాంతో మీడియం, లైట్ మెషిన్ గన్‌లతో కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. అదే సమయంలో రాజౌరి జిల్లాలోని టెర్యాత్ ప్రాంతంలోని ఖబ్బర్ గ్రామంలో మరో డ్రోన్ కనిపించిందని చెప్పారు. మెరిసే కాంతితో ఉన్న ఆ ఎగిరే వస్తువు కలకోట్‌లోని ధర్మసల్ గ్రామం వైపు నుంచి వచ్చి భరఖ్ దిశగా కదిలినట్లు వివరించారు. ఇక సాంబా జిల్లాలోని రామ్‌గఢ్ సెక్టార్‌లో ఉన్న చక్ బాబ్రాల్ గ్రామంపై సాయంత్రం 7.15 గంటల సమయంలో డ్రోన్‌లాంటి వస్తువు మెరుస్తూ చాలా సేపు గాలిలో తిరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
వివరాలు
ఘగ్వాల్ ప్రాంతంలోని పలూరా గ్రామంలో పాకిస్థాన్‌లో తయారైన డ్రోన్
అలాగే పూంచ్ జిల్లాలోని ఎల్‌ఓసీ వెంబడి తంయిన్ వైపు నుంచి మంకోట్ సెక్టార్‌లోని టోపా దిశగా సాయంత్రం 6.25 గంటలకు మరో అనుమానాస్పద డ్రోన్ కదలిక కనిపించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, శుక్రవారం రాత్రి సాంబా జిల్లాలోని ఐబీ సమీపంలో ఉన్న ఘగ్వాల్ ప్రాంతంలోని పలూరా గ్రామంలో పాకిస్థాన్‌లో తయారైన డ్రోన్ ద్వారా జారవిడిచినట్లు భావిస్తున్న ఆయుధాల సముదాయాన్ని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. వాటిలో రెండు పిస్టల్స్, మూడు మ్యాగజైన్‌లు, 16 రౌండ్లు, ఒక గ్రెనేడ్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనల నేపథ్యంలో భద్రతా బలగాలు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి.
వివరాలు
పెద్ద ఎత్తున డ్రోన్ కదలికలు
గతేడాది మే 7న భారతదేశం పాకిస్థాన్‌పై 'ఆపరేషన్ సిందూర్' చేపట్టింది. ఆ ఆపరేషన్ సమయంలో అనేక పాకిస్థానీ డ్రోన్లను భారత సైన్యం కూల్చివేసింది. అప్పటి నుంచి డ్రోన్ సంచారం గణనీయంగా తగ్గినప్పటికీ, చాలా రోజుల తర్వాత మళ్లీ ఒకేసారి పెద్ద ఎత్తున డ్రోన్ కదలికలు కనిపించాయి. భారత భూభాగంలో ఆయుధాలు, మాదకద్రవ్యాలను జారవిడిచేందుకు ఉగ్రవాద గ్రూపులకు మద్దతుగా పాకిస్థాన్ ఈ డ్రోన్లను వినియోగిస్తున్నట్లు భద్రతా వర్గాలు అనుమానిస్తున్నాయి.