
21 అండమాన్ దీవులకు వీరుల పేర్లు, నేతాజీ స్మారక నమూనాను ఆవిష్కరించిన ప్రధాని మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
అండమాన్ నికోబార్ దీవుల్లోని 21 పేరు లేని దీవులకు పరమవీర చక్ర అవార్డు పొందిన 21 మంది వీరుల పేర్లను పెట్టారు ప్రధాని మోదీ. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి(జనవరి 23) సందర్భంగా నిర్వహించిన 'పరాక్రమ దివస్'లో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పాల్గొన్న ప్రధాని మోదీ ఈ పేర్లను ప్రకటించారు.
అలాగే, సుభాష్ చంద్రబోస్ ద్వీపంలో నిర్మించనున్న నేతాజీ స్మారక నమూనాను మోదీ ఆవిష్కరించారు. అండమాన్ నికోబార్ దీవులకు ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని, నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను గౌరవింకుంటూ ఆ మహనీయుని స్మారకార్థంగా అండమాన్ నికోబార్ దీవుల్లోని రాస్ దీవులకు 2018లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీప్‌గా నామకరణం చేశారు.
నేతాజీ
ఈ ద్వీపాలు రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి: ప్రధాని
పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పేరును పెట్టబడిన ఈ ద్వీపాలు రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని ప్రధాని మోదీ అన్నారు. ఈ పేర్లు పెట్టడం వల్ల ప్రతి భారతీయుడి హృదయం ఉప్పొంగుతుందన్నారు.
దీవులకు పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పేరు పెట్టడం వల్ల అవి ఎప్పటికీ ఆ వీరులను గుర్తు చేస్తాయని హోంమంత్రి అమిత్ షా అన్నారు.
పరమవీర చక్ర అవార్డు గ్రహీతలను సత్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ అధికారి చెప్పారు. 21 ద్వీపాల్లో 16 ఉత్తర, మధ్య అండమాన్ జిల్లాల్లో, ఐదు దక్షిణ అండమాన్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు.