All-party meeting: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. కేంద్రం ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం
డిసెంబర్ 4 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. డిసెంబరు 22 వరకు సమావేశాలు జరుగుతాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం శనివారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన పలువురు నేతలు పార్లమెంటరీ లైబ్రరీ భవనంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్నారు. తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై "క్యాష్ ఫర్ క్వెరీ" ఆరోపణలపై ఎథిక్స్ కమిటీ నివేదికపై లోక్‌సభలో చర్చకు డిమాండ్ చేశారు.
అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఒకరోజు ముందే సమావేశం
డిసెంబర్ 3న నాలుగు రాష్ట్రాల (రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ మరియు తెలంగాణ) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించడానికి ఒక రోజు ముందు ఈ సమావేశం జరగడం గమనార్హం. ఎన్నికల ఫలితాలపై శీతాకాల సెషన్‌లో చర్చ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణంగా పార్లమెంట్ సమావేశాలు నిర్వహించేటప్పుడు.. ఒకరోజు ముందు అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తారు. కానీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కారణంగా ఒక రోజు ముందుగానే ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేశారు. IPC, CrPC, ఎవిడెన్స్ యాక్ట్‌లను ఉద్దేశించిన మూడు ముఖ్యమైన బిల్లులను ఈ సెషన్‌లో చర్చంచే అవకాశం ఉంది.