ఈ నెలలోనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు.. కేంద్రం ఏం చేయబోతోంది
సెప్టెంబర్ 18-22 మధ్య ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశాలను నిర్వహించాలని గురువారం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కొత్త పార్లమెంట్‌లోనే స్పెషల్ సెషన్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే యూనిఫామ్ సివిల్ కోడ్, మహిళల రిజర్వేషన్ బిల్లు,కీలక జమిలీ ఎన్నికలు (దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు) తదితర బిల్లులను ఆమోదించనున్నట్లు సమాచారం. కాశ్మీర్ లో ఎన్నికలకు సంబంధించి ఇటీవలే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఆ అంశంపైనా చర్చించే అవకాశం ఉంది. ఆర్టికల్ 370డిపైనా చర్చించనున్నట్లు అధికార వర్గాలు అంటున్నాయి. భారత అంతరిక్ష కేంద్రం-ఇస్రో నేతృత్వంలో చంద్రయాన్-3 మిషన్ సక్సెస్ కావడంతో దానిపైనా చర్చలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. G-20 శిఖరాగ్ర సమావేశాల్లో చర్చకు వచ్చిన అంశాలపై స్పెషల్ సెషన్లో చర్చించనున్నట్లు సమాచారం.
ముందస్తు ఎన్నికలపై జోరుగా ఊహాగానాలు
మరోవైపు ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు విస్త్రృతం అయ్యాయి. సెప్టెంబర్‌లో లోక్‌సభను రద్దు చేసి నవంబర్ లేదా డిసెంబర్లో ముందస్తుకు వెళ్లేందుకు కేంద్రం ప్లాన్ చేస్తున్నట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనిపై విపక్ష కూటమి నేతలు పెదవి విరుస్తున్నారు. మోదీ సర్కార్ డిసెంబర్లో ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తోందని, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బిహార్ సీఎం నితీశ్ కుమార్ అనుమానం వ్యక్తం చేశారు. ఇండియా కూటమి భేటీ, అదానీ వ్యవహారాన్ని దారి మళ్లించేందుకే ప్రత్యేక సెషన్ అని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ విమర్శించారు. అదానీ ఇష్యూ పై ఇదే సెషన్లో జేపీసీ(JOINT PARLIAMENTARY COMMITTEE) వేయాలని డిమాండ్ చేస్తామన్నారు. గణేష్ ఉత్సవాల సమయంలో సమావేశాలేంటని ఎంపీ ప్రియాంక ప్రశ్నించారు.