Parliament Winter Session: నేటినుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. 14 కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న కేంద్రం
ఈ వార్తాకథనం ఏంటి
నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు లోక్‌సభ, రాజ్యసభల సమావేశాలు మొదలుకాబోతున్నాయి. ఈ శీతాకాల సమావేశాలు కూడా రసపట్టే వాతావరణంలో జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. గత వర్షాకాల సమావేశాల సమయంలోనూ తీవ్ర వాగ్వాదాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. బీహార్ ఎన్నికల ముందు ఎన్నికల సంఘం నిర్వహించిన ఓటర్ల సర్వేపై విపక్షాలు పెద్ద స్థాయిలో నిరసనలు వ్యక్తం చేశాయి. ఇప్పుడు బీహార్ ఎన్నికల ఫలితాల అనంతరం మరోసారి సమావేశాలు జరుగుతుండగా,తమిళనాడు, కేరళ,పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఓటర్ సర్వేను కూడా ప్రతిపక్షాలు ఘాటుగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ అంశమే మరోసారి పార్లమెంట్‌ను ఉత్కంఠభరితంగా మారుస్తుందనే అంచనాలు వెలువడుతున్నాయి.
వివరాలు
14 బిల్లులను ప్రవేశపెట్టనున్న ఎన్డీఏ ప్రభుత్వం
అదేవిధంగా ఇటీవల ఢిల్లీలో చోటుచేసుకున్న పేలుడు ఘటనపై కూడా సభల్లో చర్చ జరిపేందుకు విపక్షాలు పట్టుబట్టే అవకాశం ఉంది. ఇక ఈ సమావేశాల్లో మొత్తం 14 బిల్లులను ప్రవేశపెట్టేందుకు ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధమవుతోంది. వీటిలో అణుశక్తి బిల్లు ప్రధానమైనదిగా ఉంది. అలాగే విద్యా కమిషన్ బిల్లు, పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం, సెస్ విధించే అంశానికి సంబంధించిన బిల్లులు, పాన్ మసాలాపై ప్రత్యేక బిల్లు కూడా సభ ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
వివరాలు
డిసెంబర్ 19న ముగియనున్న శీతాకాల పార్లమెంట్ సమావేశాలు
మరోవైపు ఈరోజు ఉదయం 10 గంటలకు పార్లమెంట్ భవనంలో ఉభయసభల ప్రతిపక్ష నేతలు సమావేశం కానున్నారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో ఈ భేటీ జరుగనుంది. "ఓటర్ల జాబితా క్రమబద్ధీకరణ", దేశవ్యాప్తంగా ఉగ్రవాద దాడులు, అంతర్గత భద్రత పరిస్థితులు, దేశ రాజధానిలో తీవ్రతరమైన వాయు కాలుష్య పరిస్థితి, పెరుగుతున్న ధరలు, నిరుద్యోగ సమస్య వంటి కీలక అంశాలపై సభల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించి కార్యాచరణను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాలు డిసెంబర్ 19న ముగియనున్నాయి.