తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో అమిత్ షా.. అమరవీరులకు నివాళులు
తెలంగాణ విమోచన వేడుకల్ని కేంద్రం అధికారికంగా నిర్వహించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగరేసిన షా, సాయుధ పోరాటయోధులకు, సర్ధార్ వల్లభభాయ్ పటేల్‌కు నివాళులు అర్పించారు. అనంతరం సైనిక వందనాన్ని స్వీకరించారు. విమోచన దినోత్సవం సందర్భంగా తెలంగాణ, హైదరాబాద్-కర్ణాటక, మరాఠ్వాడా ప్రజలకు షా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. నిజాం దుష్ట పాలన, అణచివేత నుంచి విముక్తి కోసం అలుపెరగని పోరాటానికి, ఇక్కడి ప్రజల దేశభక్తికి సెప్టెంబర్ 17 నిదర్శనమన్నారు. హైదరాబాద్ ముక్తి సంగ్రామంలో అమరులకు నివాళులర్పించారు. సర్ధార్ పటేల్ లేకుంటే తెలంగాణకు విముక్తి లభించేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. పటేల్, మున్షి కృషి ఫలితంగానే నిజాం పాలన అంతమైపోయిందన్నారు.
విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కేంద్ర హోంశాఖ మంత్రి
అలాంటి వాళ్లను దేశ ప్రజలు క్షమించరు: అమిత్ షా
హైదరాబాద్‌కు విముక్తి లభించిన రోజు సెప్టెంబర్ 17 అని గుర్తు చేసిన అమిత్ షా, తెలంగాణ ప్రజలకు అభినందనలు తెలియజేశారు. తెలంగాణ విమోచన దినాన్ని సైతం కొందరు రాజకీయం చేస్తున్నారని, అలాంటి వాళ్లను దేశ ప్రజలు క్షమించరని షా చెప్పారు. స్వాతంత్ర పోరాటాన్ని సైతం కాంగ్రెస్ వక్రీకరించిందన్న షా, భవిష్యత్ తరాలకు తెలంగాణ విమోచన చరిత్ర తెలియాలన్నారు. సాయుధ బలగాల కోసం 80 ఎకరాల స్థలంలో నిర్మించిన స్వశస్త్ర సీమా బల్ క్వార్టర్లను అమిత్ షా వర్చువల్ గా ప్రారంభించారు. మరోవైపు షోయబుల్లా ఖాన్, రాంజీ గోండు పోస్టల్ కవర్ ను ఆవిష్కరించారు. కాంగ్రెస్ గత తప్పులను మోదీ సరిద్దారన్నారు. మోదీ జన్మదినాన్ని సేవా దివస్ గా జరుపుకుంటున్నట్లు వివరించారు.