IndiGo: విమానంలో కలకలం: గాల్లో ఎమర్జెన్సీ డోర్ తెరవడానికి ప్రయాణికుడి ప్రయత్నం - ఇండిగో ఫ్లైట్‌లో ఉద్రిక్తత
ఈ వార్తాకథనం ఏంటి
బెంగళూరు నుంచి వారణాసికి ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడి విచిత్ర ప్రవర్తన కలకలం రేపింది. విమానం గాల్లో ఉండగానే అతడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్‌ను తెరవడానికి రెండుసార్లు ప్రయత్నించడంతో ప్రయాణికుల్లో తీవ్ర భయం నెలకొంది. పరిస్థితి తీవ్రంగా మారడంతో పైలట్ ముందస్తు జాగ్రత్తగా ల్యాండింగ్‌ను నిలిపివేసి విమానాన్ని మళ్లీ గాల్లోకి తీసుకెళ్లాల్సి వచ్చింది. అనంతరం విమానం సురక్షితంగా ల్యాండ్ అవ్వగా, నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం,బెంగళూరు నుంచి వారణాసి బయలుదేరిన ఇండిగో విమానం (6E 185)లో ప్రయాణిస్తున్న ఉత్తరప్రదేశ్‌లోని మౌ జిల్లాకు చెందిన మహ్మద్ అద్నాన్ (22) అనే యువకుడు గాల్లో ఉండగానే తొలిసారి ఎమర్జెన్సీ డోర్‌ను తెరవడానికి ప్రయత్నించాడు.
వివరాలు
"గో-అరౌండ్" ప్రక్రియ
ఇది గమనించిన విమాన సిబ్బంది వెంటనే అతడిని అడ్డుకుని హెచ్చరించి, సీటును మార్చారు. అయితే విమానం వారణాసి విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యేందుకు సిద్ధమవుతున్న సమయంలో అద్నాన్ మరోసారి అదే చర్యకు పాల్పడ్డాడు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే పైలట్‌కు సమాచారం అందించారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పైలట్ వెంటనే "గో-అరౌండ్" ప్రక్రియను అమలు చేసి, ల్యాండింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. కొంతసేపటి తర్వాత విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ల్యాండింగ్ అనంతరం అద్నాన్‌ను సీఐఎస్ఎఫ్ సిబ్బందికి అప్పగించగా, వారు ఫూల్‌పూర్ పోలీసులకు అప్పగించారు.
వివరాలు
ఏం జరిగిందో గుర్తులేదు..
పోలీసులు నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 125 కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. విచారణలో అద్నాన్ ఇచ్చిన సమాధానాలు స్పష్టంగా లేవని సమాచారం. తాను ఆ సమయంలో దెయ్యం పట్టినట్లుగా ప్రవర్తించానని, ఏం జరిగిందో గుర్తులేదని చెప్పినట్లు వెల్లడైంది. ఈ ఘటనపై యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్), ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారులు కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.