మీర్ ఉస్మాన్ అలీఖాన్ మనుమడు షహమత్ ఝా బహదూర్ కన్నుమూత
హైదరాబాద్ ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మనుమడు, మోజామ్ జహ్ బహదూర్ (1907-1987) ఏకైక కుమారుడు షహమత్ జహ్ బహదూర్ (70) అనారోగ్యంతో ఆదివారం కన్నుమూశారు. మీర్ ఉస్మాన్ అలీఖాన్ రెండో కుమారుడు మోజమ్ జా, యువరాణి అన్వారీ బేగంలకు షహమత్ ఝా 1955లో జన్మించారు. అతను తన చివరి రోజుల్లో టోలి చౌకీలో నివాసం ఉన్నారు. షహమత్ ఝా ఉర్దూలో ప్రముఖ కవి అని, అతని అనేక సంకలనాలు ప్రచురించబడ్డాయని హైదరాబాద్‌కు చెందిన చరిత్రకారుడు డాక్టర్ మహ్మద్ సఫియుల్లా తెలిపారు.
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో షహమత్ ఝా విద్యాభ్యాసం
బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో షహమత్ ఝా చదువుకున్నారు. షహమత్ ఝాకు సంతానం లేరు. ఆయన రెండు పెళ్లిళ్లు చేసుకోగా, ఇద్దరికి కూడా సంతానం కలగలేదు. చాలా కాలంగా ఆయన ఒంటరిగానే జీవనం గడుపుతున్నారు. ఇషా ప్రార్థనల అనంతరం కింగ్ కోటిలోని మస్జిద్-ఎ-జూదీలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గత ఏడు నెలల్లో నిజాం కుటుంబంలో ఇది రెండో మరణం. ముకర్రం ఝా జనవరి 14న టర్కీలోని ఇస్తాంబుల్‌లో కన్నుమూశారు. షహమత్ ఝాకు ముగ్గురు సోదరీమణులు ప్రిన్సెస్ ఫాతిమా ఫౌజియా, ప్రిన్సెస్ అమీనా మెర్జియా, ప్రిన్సెస్ ఊలియా కుల్సుమ్ ఉన్నారు.