పట్టాభిని పోలీసులు చిత్రహింసలు పెట్టారా? జడ్జి ఎదుట టీడీపీ నేతలు హాజరు
గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి అనంతరం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ- టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ నేపథ్యంలో పట్టాభితో పాటు మరో 11మంది టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే వీరిని మంగళవారం సాయంత్రం ఏపీ పోలీసులు గన్నవరం కోర్టుకు తరలించారు. కోర్టుకు వచ్చినప్పుడు, పట్టాభి మీడియాకు తన వాచిపోయిన ఫోర్‌హ్యాండ్‌ను చూపిస్తూ పోలీసులు కస్టడీలో హింసించారని ఆరోపించారు. తన భర్త, టీడీపీ సీనియర్ నేత పట్టాభి రామ్ గత 24 గంటల నుంచి కనిపించడం లేదని ఆయన భార్య చందన ఆందోళనకు దిగిని కొద్దిసేపటికే అరెస్టు చేసిన వారికి జడ్జి ఎదుట హాజరు పర్చడం గమనార్హం.
కళ్లకు గంతలు కట్టి కొట్టారు: గొట్టిముక్కల
పోలీసులు తమ నాయకుడు పట్టాభి రామ్‌ను దారుణంగా కొట్టారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం రాత్రి పట్టాభిని ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్‌కి మార్చి, ముగ్గురు వ్యక్తులు కళ్లకు గంతలు కట్టి కొట్టారని టీఎన్‌టీయూసీ ఏపీ చీఫ్ గొట్టిముక్కల రఘు రామకృష్ణంరాజు ఆరోపించారు. పట్టాభిని పోలీసులు దారుణంగా హింసించారని ఆయన భార్య చందన కూడా ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిస్థితిపై అందరూ ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఈ ఘటన జరగడం భాదాకరణమని టీడీపీ నాయకులు చెబుతున్నారు. అయితే పట్టాభిని హింసించినట్లు టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై పోలీసులు స్పందించాల్సి ఉంది.