Pawan Kalyan: నిరంజన్ కోరిక తీర్చిన పవన్ కళ్యాణ్.. ఎమోషనల్ క్షణాలు వైరల్
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి,జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. అరుదైన డీఎండీ (డుచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ) జన్యుపరమైన వ్యాధితో బాధపడుతూ ఎదుగుదల లేక మంచానికే పరిమితమైన తన అభిమాని నిరంజన్‌ను స్వయంగా ఇంటికి వెళ్లి పరామర్శించారు. అతడికి, అతడి కుటుంబానికి అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చి ఆర్థిక సాయం అందజేశారు. హనుమకొండలోని హనుమాన్ నగర్‌కు చెందిన 17 ఏళ్ల నిరంజన్ చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని. అరుదైన వ్యాధితో బాధపడుతున్న అతడు తన చివరి కోరికగా పవన్ కళ్యాణ్‌ను ఒక్కసారి కలవాలని కోరుకున్నాడు. ఈ విషయం తెలంగాణ జనసేన నాయకుల ద్వారా తెలుసుకున్న పవన్ కళ్యాణ్ బుధవారం స్వయంగా నిరంజన్ నివాసానికి వెళ్లి అతడిని కలిశారు.
వివరాలు
వైద్య ఖర్చుల కోసం రూ.1 లక్షల ఆర్థిక సాయం
నిరంజన్‌ను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని పలకరించిన పవన్ కళ్యాణ్, అతడి తల్లిదండ్రులు పొనుగోటి రాంగోపాల్, మానసతో మాట్లాడారు. నిరంజన్ ఆరోగ్య పరిస్థితి, ప్రస్తుతం ఎక్కడ వైద్యం చేయిస్తున్నారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. అతడిని కాపాడేందుకు ఇంకా ఎలాంటి వైద్య సహాయం అందించవచ్చనే విషయంపై కూడా ఆరా తీశారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, భగవంతుడి ఆశీస్సులు నిరంజన్‌కు ఉంటాయని చెబుతూ మనోధైర్యాన్ని నింపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారి తీర్థ ప్రసాదాలను అందించిన పవన్ కళ్యాణ్, నిరంజన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వైద్య ఖర్చుల కోసం రూ.1 లక్షల ఆర్థిక సాయం అందజేసి కుటుంబానికి అండగా నిలిచారు.
వివరాలు
అభిమానిని చూసి భావోద్వేగానికి గురైన జనసేనాని
నిరంజన్‌ను చూసేందుకు ఇంట్లోకి వెళ్లిన పవన్ కళ్యాణ్, లేవలేని స్థితిలో మంచంపై ఉన్న తన అభిమానిని చూసి భావోద్వేగానికి గురయ్యారు. అతడి మంచంపైనే కూర్చుని ఆప్యాయంగా హత్తుకుని నుదిటిపై ముద్దు పెట్టారు. చిన్ననాటి నుంచి మీరంటే ఎంతో అభిమానమని నిరంజన్ చెప్పడంతో పవన్ కళ్యాణ్ కూడా ఎమోషనల్ అయ్యారు. తిరుమల ఆలయం నుంచి తెప్పించిన పవిత్ర వస్త్రాన్ని నిరంజన్‌కు కప్పి, కళ్యాణం అక్షతలు ఇచ్చి ఆశీర్వదించారు. నిరంజన్ ఆరోగ్యం కోసం వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయిస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. అలాగే భద్రకాళి అమ్మవారి వెండి ప్రతిమకు ప్రత్యేక పూజలు నిర్వహించి కుటుంబ సభ్యులకు అందజేస్తానని తెలిపారు.
వివరాలు
చోటా గబ్బర్ సింగ్.. 'నిరంజన్'
నిరంజన్ ఆరోగ్యంగా ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్‌ను అనుకరిస్తూ చేసిన డ్యాన్స్ వీడియోలు, ఫొటోలను చూసిన పవన్ ఆనందం వ్యక్తం చేశారు. తనను అందరూ "చోటా గబ్బర్ సింగ్" అని పిలుస్తారని నిరంజన్ చెప్పడంతో చిరునవ్వులు చిందించారు. ఈ సందర్భంగా ఓ కుక్కపిల్లను పెంచుకోవాలని ఉందని నిరంజన్ చెప్పగా, దానిని కొనిపంపిస్తానని పవన్ హామీ ఇచ్చారు. ఇంటి యజమానుల అనుమతి అవసరమని నిరంజన్ తండ్రి చెప్పడంతో, స్వయంగా ఇంటి యజమానులను పిలిపించి వారితో మాట్లాడటం అక్కడున్న వారిని ఆకట్టుకుంది.
వివరాలు
వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయానికి పవన్
నిరంజన్ తల్లిదండ్రుల జీవనోపాధి గురించి కూడా పవన్ కళ్యాణ్ తెలుసుకున్నారు. గతంలో కాకతీయ ఆసుపత్రి క్యాంటీన్‌లో పని చేశామని వారు చెప్పడంతో, వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడేలా క్యాంటీన్ ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని జనసేన తెలంగాణ రాష్ట్ర నాయకులకు సూచించారు. నిరంజన్‌ను పరామర్శించిన అనంతరం పవన్ కళ్యాణ్ నేరుగా వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయానికి బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో జనసేన తెలంగాణ ఇన్‌చార్జ్ శంకర్ గౌడ్, పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, నాయకులు రాధారం రాజలింగం, ఆర్.కే. సాగర్ తదితరులు పాల్గొన్నారు.