pawan kalyan: చిన్నారి కోసం కాన్వాయ్ ఆపిన పవన్ కళ్యాణ్
కాకినాడ జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటనలో భాగంగా బుధవారం మూడో రోజు ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఉప్పాడ వద్ద కోతకు గురవుతున్నసముద్ర తీరాన్నిపరిశీలించేందుకు బయలుదేరిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు ఓ బాలుడు ఇంటి ముందు జనసేన జెండా ఉపుతూ కనపడడంతో పవన్ ఒక్కసారిగా తన కాన్వాయ్‌ను ఆపారు. కారు దిగి అబ్బాయి దగ్గరకు వెళ్లి అతడిని దగ్గరకు తీసుకుని కాసేపు మాట్లాడారు.ఈ దృశ్యాన్ని స్థానికులు తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు. పవన్ కళ్యాణ్ సింప్లిసిటీని పలువురు స్థానికులు కొనియాడారు. అనంతరం ఉప్పాడ కొత్తపల్లి మండలంలో కోతకు గురైన సముద్ర తీరాన్ని పరిశీలించారు.
చెన్నై నుంచి వచ్చిన నిపుణుల బృందం ఉప్పాడ తీరాన్ని పరిశీలిస్తుంది: పవన్
అనంతరం మత్స్యకారులతో మాట్లాడారు. ఉప్పాడ తీరం భారీగా కోతకు గురవుతోంది. గత ఏడాదిన్నర కాలంలో ఎకరం భూమి సముద్రంలో కలిసిపోయింది.తీరం తీవ్రంగా దెబ్బతింది. ఈ కోతను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. చెన్నై నుంచి వచ్చిన నిపుణుల బృందం ఉప్పాడ తీరాన్ని పరిశీలించి, రక్షణకు అవసరమైన చర్యలను సూచిస్తుందని చెప్పారు. కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యు.కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామంలో పంచాయతీరాజ్, గ్రామీణ తాగునీటి సరఫరా పథకంలోని రక్షిత మంచినీటి ట్యాంకు, సూరప్ప చెరువును పరిశీలించారు. ఉప్పాడ కొత్తపల్లి మండలానికి రక్షిత మంచినీటిని సరఫరా చేస్తున్న ఈ ట్యాంక్ వివరాలను ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ఆయనకు వివరించారు.
సముద్రం కోతకు గురైన ప్రాంతాల పరిశీలన
సూరప్ప చెరువు సమీపంలోని 7ఎంఎల్‌డీ ఇసుక వడపోత, పవర్‌హౌస్, ల్యాబ్‌లను ఆయన పరిశీలించారు. కాకినాడ ఎంపీ టీ ఉదయ్ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జెడ్పీ సీఈవో శ్రీరామచంద్రమూర్తి, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ ఎంవీ సత్యనారాయణ, డీపీఓ కె.భారతి సౌజన్య, ఆర్డీఓ కిషోర్ పాల్గొన్నారు. ఉప్పాడ ప్రాంతంలో సముద్రం కోతకు గురైన ప్రాంతాలను కూడా ఉపముఖ్యమంత్రి పరిశీలించారు.