
Pawan Kalyan: మహారాష్ట్ర గడ్డపై పవన్ కల్యాణ్ పర్యటన.. మరాఠీ, హిందీ, తెలుగు భాషల్లో ఆకట్టుకున్న ప్రసంగం
ఈ వార్తాకథనం ఏంటి
మహారాష్ట్ర బల్లార్‌పూర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడారు.
మరాఠీ, హిందీ, తెలుగు భాషల్లో మాట్లాడిన ఆయన, తాను మరాఠీ మాట్లాడినప్పుడు ఏమైనా తప్పులు దొర్లితే క్షమించాలంటూ కోరారు.
రెండు రోజుల్లో మరాఠీ భాషను కొంతవరకు నేర్చుకున్నానని పేర్కొన్నారు. మహారాష్ట్రకు, శివాజీ మహారాజ్ భూమికి శిరస్సు వంచి నమస్కరిస్తానని, మరాఠా గడ్డపై నిలబడటం గర్వంగా ఉందన్నారు.
అయోధ్య రామమందిర నిర్మాణంలో మహారాష్ట్ర ప్రజల పాత్రను పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. 500 ఏళ్ల నిరీక్షణ తర్వాత రాముడికి తన స్థానం దక్కిందని అన్నారు.
Details
మోదీ హాయంలోనే మహారాష్ట్ర అభివృద్ధి
ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, నితిన్ గడ్కరీల నాయకత్వంలో మహారాష్ట్రలో అభివృద్ధి తారా స్థాయికి చేరిందని ప్రశంసించారు.
తన ఈ పర్యటన ఓట్లు అడగటానికి కాదని, మహారాష్ట్ర అభివృద్ధికి తన గౌరవం తెలపడానికి వచ్చానని స్పష్టం చేశారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఐదో స్థానంలో ఉన్నా, మూడో స్థానానికి చేరుకునే లక్ష్యంతో కృషి చేస్తున్నామని వివరించారు.
పవన్ కళ్యాణ్, హిందూ హృదయ సామ్రాట్ బాలా సాహెబ్ ఠాక్రే స్మృతిని గుర్తు చేస్తూ, ఆయన నడిచిన భూమిలో నిలబడటం తనకు గౌరవమని తెలిపారు.
ఆర్ఎస్ఎస్ ఆత్మీయ శక్తిని ప్రశంసిస్తూ, వారి నిబద్ధత వల్లే దేశం ఈ స్థాయికి చేరిందని తెలిపారు.
Details
2028 నాటికి 1 ట్రిలియన్ డాలర్లగా మహారాష్ట్ర ఆర్థిక వ్యవస్థ
ప్రాంతీయతను ప్రోత్సహించడంలో జాతీయతను విస్మరించకూడదని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.
స్థానిక వనరులు, మానవ వనరులు పరిరక్షించాలన్న తపనతో తాను తెలంగాణకు కూడా మద్దతు తెలిపినట్లు వివరించారు.
మహారాష్ట్రను 2028 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ఎన్డీఏ లక్ష్యమని పవన్ కళ్యాణ్ తెలిపారు.
మరాఠా గడ్డపై తన హోదాను మరింత సమర్థవంతంగా వినియోగించి, ఎన్డీఏ విజయానికి మద్దతు తెలపడం తన లక్ష్యమని స్పష్టం చేశారు.
మహారాష్ట్ర ప్రజల సహకారంతో మహాయుతీ సర్కార్ అవతరణ సాధ్యం అవుతుందని అభిప్రాయపడ్డారు.