జనసేన ఆవిర్భావం: వారాహి వాహనంపై మచిలీపట్నానికి పవన్ కళ్యాణ్
జనసేన 10వ వార్షికోత్సవం జరుపుకుంటున్న వేళ.. మచిలీపట్నంలో ఆవిర్భావ వేడకలను నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా మచిలీపట్నంలో ఆవిర్భావ వేడకల్లో పాల్గొనేందుకు ఎన్నికల ప్రచారం వాహనం 'వారాహి'పై బయలుదేరారు. విజయవాడ ఆటోనగర్ నుంచి మచిలీపట్నానికి వారాహిపై ముందుకు సాగుతూ వేలాదిగా తరలివచ్చిన పార్టీ కార్యకర్తలు, అభిమానులకు అభివాదం చేశారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్రేన్లు, సమీపంలోని భవనాలపై నుంచి అభిమానులు పూల వర్షం కురిపించారు.
సభకు దాదాపు 2 లక్షల మంది హాజరవుతారని జనసేన అంచనా
తాడిగడప జంక్షన్, పోరంకి జంక్షన్, పెనమలూరు జంక్షన్, పామర్రు బైపాస్, గూడూరు మీదుగా మచిలీపట్నంలోని సభా ప్రాంగణానికి పవన్ కల్యాణ్ వెళ్తారు. సాయంత్రం సభలో పవన్ ప్రసంగిస్తారు. మరోవైపు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు అవసరమైన ఏర్పాట్లను నాయకులు ఇప్పటికే చేశారు. ఈ సభకు దాదాపు 2 లక్షల మంది హాజరవుతారని జనసేన అంచనా వేస్తోంది. 34ఎకరాల విస్తీర్ణంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ జరుగుతోంది. మీటింగ్ జరిగే ప్రదేశానికి శ్రీ పొట్టి శ్రీరాములు పుణ్య వేదిక అని పేరు పెట్టారు.