Ambati Rayudu: వాలంటీర్ వ్యవస్థపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై అంబటి రాయుడు కౌంటర్
ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు స్పందించారు. స్వచ్ఛందంగా సేవ చేసే వాలంటీర్లను సంఘ విద్రోహశక్తులతో పవన్ కళ్యాణ్ పోల్చడాన్ని అంబటి రాయుడు తప్పు బట్టారు. వాలంటీర్లకు నిగూఢమైన ఉద్దేశ్యాలను ఆపాదించడం సరికాదన్నారు. వాలంటీర్ల వ్యవస్థ అనేది దేశానికే ఆదర్శమని రాయుడు స్పష్టం చేశారు. వాలంటీర్ వ్యవస్థ గురించి తప్పుగా మాట్లాడే వారిని విస్మరించాలన్నారు. అలాగే తమ సేవలను కొనసాగించాలని వాలంటీర్లకు పిలుపునిచ్చారు.
బరదజల్లే వారిని పట్టించుకోవద్దు: అంబటి
ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోందని, 70ఏళ్ల నుంచి దేశంలో జరగనిది ఏపీలో వాలంటీర్ల ద్వారా జరుగుతోందని అంబటి రాయుడు అభిప్రాయపడ్డారు. వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేయడం గొప్ప ఆలోచన అని, ఇది ప్రజలకు అన్ని విధాలుగా సహాయపడుతుందన్నారు. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో వాలంటీర్లు చేసిన సేవలు మరువలేనివన్నారు. కరోనా సమయంలో ప్రజలకు వాలంటీర్లు చేసిన సేవను ప్రశంసించారు. మంచి పనులు చేస్తున్న వారిపై బరదజల్లే వారు అన్నిచోట్లా ఉంటారని రాయుడు పేర్కొన్నారు. వారిని పట్టించుకుండా ముందుకుసాగాల్సిన అవసరం ఉందన్నారు.