LOADING...
Air pollution: తెలంగాణ వ్యాప్తంగా 17 చోట్ల 40 ఎయిర్‌ క్వాలిటీ మానిటరింగ్‌ స్టేషన్లు 
తెలంగాణ వ్యాప్తంగా 17 చోట్ల 40 ఎయిర్‌ క్వాలిటీ మానిటరింగ్‌ స్టేషన్లు

Air pollution: తెలంగాణ వ్యాప్తంగా 17 చోట్ల 40 ఎయిర్‌ క్వాలిటీ మానిటరింగ్‌ స్టేషన్లు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 08, 2026
12:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని దిల్లీని వాయుకాలుష్యం తీవ్రంగా కమ్మేస్తోంది. ఇదే తరహాలో హైదరాబాద్‌లో కూడా గాలి నాణ్యత తగ్గుతోందన్న ఆందోళనలు పెరుగుతున్నాయి. మనం రోజూ పీలుస్తున్న గాలి నిజంగా స్వచ్ఛమైనదేనా? అది శరీరానికి మేలు చేస్తుందా, లేక అప్రమత్తం కావాల్సిన స్థాయిలో కాలుష్యాన్ని మోస్తుందా? రాష్ట్రంలోని నగరాలు,పట్టణాల్లో ఏ సమయంలో ఎంత మేరకు వాయుకాలుష్యం నమోదవుతోంది? వంటి కీలక ప్రశ్నలకు ఇప్పటివరకు పూర్తి స్థాయి స్పష్టమైన సమాధానాలు అందడం లేదు. ప్రస్తుతం హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని కొన్ని నగరాలు,పట్టణాల్లో మాత్రమే ఎయిర్‌ క్వాలిటీ మానిటరింగ్‌ స్టేషన్లు ఉన్నాయి. ఇకపై చిన్న పట్టణాల్లో కూడా గాలి నాణ్యత వివరాలు తెలుసుకునే అవకాశం కలగనుంది.

వివరాలు 

గ్రేటర్‌లో పర్యవేక్షణ వ్యవస్థ బలోపేతం

లక్షకు పైగా జనాభా ఉన్న అన్ని పట్టణాలు,నగరాల్లో గాలి నాణ్యత పర్యవేక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జనాభా పెరుగుదల,వాహనాల సంఖ్య అధికం కావడం,పరిశ్రమల విస్తరణ వంటి కారణాలతో హైదరాబాద్‌లో వాయుకాలుష్యం ప్రతి ఏటా మరింతగా పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో నగరంలో ప్రస్తుతం ఉన్న 13 ఎయిర్‌ క్వాలిటీ మానిటరింగ్‌ (ఏక్యూఎమ్‌) స్టేషన్లను నిరంతర గాలి నాణ్యత పర్యవేక్షణ కేంద్రాలుగా (కంటిన్యూయస్‌ ఆంబియంట్‌ ఎయిర్‌ క్వాలిటీ మానిటరింగ్‌ సిస్టమ్‌ - సీఏఏక్యూఎంఎస్‌) మార్చాలని నిర్ణయించారు. సాధారణ ఏక్యూఎమ్‌ కేంద్రాల్లో రోజువారీ సగటు కాలుష్య వివరాలనే నమోదు చేస్తారు. అవి కూడా కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) నివేదికల రూపంలోనే అందుబాటులోకి వస్తాయి.

వివరాలు 

24 గంటల పాటు రియల్‌టైమ్‌లో గాలి నాణ్యతను కొలిచే అవకాశం

అయితే ఇవే కేంద్రాలు సీఏఏక్యూఎంఎస్‌లుగా మారితే, 24 గంటల పాటు రియల్‌టైమ్‌లో గాలి నాణ్యతను కొలిచే అవకాశం ఉంటుంది. ఉదయం, సాయంత్రం, రాత్రి ఇలా ఏ సమయంలో ఎంత స్థాయిలో కాలుష్యం ఉందో వెంటనే తెలుసుకోవచ్చు. కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకున్నప్పుడు అధికారులు, ప్రజలు వెంటనే అప్రమత్తమయ్యే వీలుంటుంది. దాంతో పరిశ్రమల తనిఖీలు, నియంత్రణ చర్యలు వేగంగా చేపట్టవచ్చు. అలాగే ప్రజలు కూడా ఆ సమయాల్లో ఆయా ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్త పడేందుకు ఈ సమాచారం దోహదపడుతుంది.

Advertisement

వివరాలు 

కొత్త స్టేషన్లు.. కొన్ని ప్రాంతాల్లో విస్తరణ

రాష్ట్రవ్యాప్తంగా 17 పట్టణాలు, నగరాల్లో కొత్తగా 40 ఎయిర్‌ క్వాలిటీ మానిటరింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయాలని కాలుష్య నియంత్రణ మండలి నిర్ణయం తీసుకుంది. ఇవి అమల్లోకి వస్తే గాలి నాణ్యత పర్యవేక్షణ మరింత విస్తృతమవుతుంది. కొన్ని పట్టణాల్లో తొలిసారిగా ఈ కేంద్రాలను ఏర్పాటు చేయనుండగా,మరికొన్ని ప్రాంతాల్లో అధిక జనాభా అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే ఉన్న స్టేషన్ల సంఖ్యను పెంచనున్నారు.

Advertisement

వివరాలు 

కీలకమైన కాలుష్య సూచికలు

మన శ్వాసలోకి వెళ్లే గాలిలో దాదాపు పది రకాల కాలుష్య కారకాలు ఉంటాయి. కొత్తగా ఏర్పాటు చేయనున్న ఎయిర్‌ క్వాలిటీ మానిటరింగ్‌ స్టేషన్లలో ఇవన్నీ నమోదు చేయనున్నారు. ముఖ్యంగా పీఎం-10 సూక్ష్మ ధూళికణాలు, పీఎం-2.5 అతి సూక్ష్మ ధూళికణాలు, నైట్రోజన్‌ డయాక్సైడ్‌ (ఎన్‌ఓ2), సల్ఫర్‌ డయాక్సైడ్‌ (ఎస్‌ఓ2) వంటి కాలుష్య కారకాల స్థాయిని కొలుస్తారు. ఈ నాలుగు ప్రధాన కాలుష్య కారకాలే ఎక్కువగా శ్వాసకోశ సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులకు కారణమవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

Advertisement