Madhyapradesh: మధ్యప్రదేశ్'లో ఘరానా మోసం.. రూ.10 కోట్ల కుంభకోణం.. ప్యూన్, మరో ఐదుగురు అరెస్టు
మధ్యప్రదేశ్‌లో ఓ భారీ మోసం జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్ సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీ కార్యాలయంలో ప్యూన్‌గా పనిచేస్తున్న బ్రిజేంద్రదాస్ నామ్‌దేవ్ అనే వ్యక్తి మరో ఐదుగురితో కలిసి రూ.10 కోట్ల కుంభకోణాన్ని జరిపేందుకు ప్రయత్నించాడు. పోలీసులు ఇచ్చిన వివరాల ప్రకారం, నిందితులు మొదటగా బ్రిజేంద్రను ప్యూన్‌గా కాకుండా డ్రాయింగ్, డిస్బర్స్‌మెంట్ అధికారిగా చూపించి, బ్యాంకుల్లో పనిచేసే ఇతర నిందితుల సహాయంతో విత్తన ధ్రువీకరణ విభాగానికి సంబంధించి నకిలీ పత్రాలు, డాక్యుమెంట్లు చూపించి రూ.10 కోట్ల నగదును అతడి అకౌంట్‌లో ట్రాన్స్‌ఫర్ చేశారు.
నకిలీ పత్రాలు, సీళ్లు కూడా తయారు
తరువాత, ఆ మొత్తం 50 వేర్వేరు అకౌంట్లకు బదిలీ చేసి, ఆ డబ్బుతో ప్రభుత్వానికి సంబంధించిన భూములను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారు. వారు ఈ భూములపై ప్రాజెక్టులు ఏర్పాటు చేసి, ప్రభుత్వ జాతీయ పశుసంవర్ధక పథకాన్ని ఉపయోగించి, సబ్సిడీని పొందాలనుకున్నారు. నకిలీ పత్రాలు, సీళ్లు కూడా తయారుచేసి, శాఖాపరమైన ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. అయితే, వారి పథకం బయటపడడంతో ప్యూన్‌తో సహా ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
నకిలీ పత్రాలు, భూముల స్వాధీనం
బ్రిజేంద్రదాస్ ప్రవర్తనపై విత్తన ధ్రువీకరణ అధికారి సుఖ్‌దేవ్ ప్రసాద్ అహిర్వార్‌కు అనుమానం రాగా, ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. నాలుగు నెలల క్రితం ఈ పథకాన్ని రచించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయడం, వారి వద్ద ఉన్న నకిలీ పత్రాలు, భూములను స్వాధీనం చేసుకోవడం జరిగిందని పోలీసులు వెల్లడించారు.