Jan Mahabhiyog: సీఈసీపై ఇండియా కూటమి నిరసన.. నేడు 'జన మహాభియోగ్' కార్యక్రమం
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌పై ఇండియా కూటమి నేడు వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించనుంది. తొలుత 'మాక్ పార్లమెంట్' పేరుతో ప్రచారంలోకి వచ్చిన ఈ కార్యక్రమానికి తాజాగా 'జన మహాభియోగ్'గా పేరు మార్చారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు ఈ సమావేశం జరగనుంది. మాజీ లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్ అధ్యక్షతన ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం పనితీరు, ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ, జాబితాల నుంచి ఓటర్ల పేర్ల తొలగింపు వంటి అంశాలపై ప్రతిపక్ష పార్టీల నేతలు చర్చించనున్నారు.
వివరాలు
ఇండియా కూటమిలోని 19 రాజకీయ పార్టీలు
ముఖ్యంగా దేశవ్యాప్తంగా సుమారు 13.5 కోట్ల మంది ఓటర్ల పేర్లను జాబితాల నుంచి తొలగించారన్న అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించనున్నట్లు సమాచారం.
ఓటుహక్కు పరిరక్షణ, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, ఎన్నికల సంఘం స్వతంత్రతపై తమ అభిప్రాయాలను ఈ వేదిక ద్వారా ప్రజలకు వివరించాలని ఇండియా కూటమి నిర్ణయించింది.
ఈ సమావేశాన్ని రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రారంభించనున్నారు.
అనంతరం వివిధ పార్టీల నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తారు. చివరగా లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ముగింపు ప్రసంగం చేయనున్నారు.
ఇండియా కూటమిలోని 19 రాజకీయ పార్టీలకు చెందిన నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ వాదనలు వినిపించనున్నారు.
ఒక్కో పార్టీ ప్రతినిధికి మాట్లాడేందుకు ఐదు నిమిషాల సమయం కేటాయించారు.
వివరాలు
ఈ కార్యక్రమంలో ప్రసంగించనున్న 30 మంది వక్తలు
వీరితో పాటు ఓటర్ల జాబితాల నుంచి పేర్లు తొలగించబడిన బాధితులు, పౌర సమాజానికి చెందిన ముగ్గురు ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు.
తమకు ఎదురైన సమస్యలు, అనుభవాలను వివరించడంతో పాటు అభిప్రాయాలను వెల్లడించనున్నారు.
మొత్తం 30 మంది వక్తలు ఈ కార్యక్రమంలో ప్రసంగించనున్నారు.
ఓటర్ల జాబితాల నుంచి పేర్లు తొలగించడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వాటి వల్ల ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియపై పడే ప్రభావం, ఎన్నికల సంఘం బాధ్యతలు తదితర అంశాలు ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి.