BJP: కాంగ్రెస్ తప్పులను ప్రజలు క్షమించరు: బీజేపీ తీవ్ర విమర్శలు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధాని నరేంద్ర మోదీని పదవి నుంచి దించాలనే లక్ష్యంతోనే కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని భారతీయ జనతా పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఓటు చోరీకి వ్యతిరేకంగా దిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో కాంగ్రెస్ నిర్వహించిన మెగా ర్యాలీని ఉదహరిస్తూ.. ఆ పార్టీ అసలు ఉద్దేశం ఇప్పుడు బయటపడిందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా విమర్శించారు. ర్యాలీలో కాంగ్రెస్ కార్యకర్తలు ప్రధాని మోదీపై చేసిన వివాదాస్పద నినాదాలే దీనికి నిదర్శనమని ఆయన అన్నారు. కాంగ్రెస్ చేపట్టిన ఈ ర్యాలీ ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (సర్)కు వ్యతిరేకంగా కాదని, నేరుగా ప్రధాని మోదీని పదవి నుంచి తొలగించాలనే లక్ష్యంతోనే నిర్వహించిందని షెహజాద్ పూనావాలా ఆరోపించారు.
Details
ర్యాలీ అనంతరం సంతకాల సేకరణ
ఇప్పటి వరకు వందలసార్లు ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేశారని, కానీ వారి తప్పులను ఇక ప్రజలు క్షమించే పరిస్థితి లేదన్నారు. ప్రధాని మోదీపై, ఆయన కుటుంబంపై విమర్శలు కొనసాగిస్తున్నంతకాలం కాంగ్రెస్‌ను ప్రజలు తిరస్కరిస్తూనే ఉంటారని స్పష్టం చేశారు. ఓటు చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ రామ్‌లీలా మైదాన్‌లో భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ర్యాలీలో పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఓటు చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ దేశవ్యాప్తంగా 5.50కోట్ల సంతకాలను సేకరించిందని, ర్యాలీ అనంతరం ఈ సంతకాలను రాష్ట్రపతికి అందజేస్తామని పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ వెల్లడించారు.