Petrol, Diesel Prices: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపు.. వాహనదారులకు భారీ భారం
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. లీటరు పెట్రోల్‌పై సగటున రూ.3, డీజిల్‌పై రూ.3 వరకు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. కొత్త ధరలు ఇవాళ ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. ఈ పరిస్థితుల్లో కూడా ప్రభుత్వరంగ చమురు సంస్థలు దాదాపు 11 వారాల పాటు ఇంధన ధరలను మార్చకుండా కొనసాగించాయి. అయితే పెరుగుతున్న ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా చివరకు ధరలను పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వివరాలు
పెట్రోల్ బంకుల వద్ద వాహనాల క్యూలు
2022 ఏప్రిల్ తర్వాత దేశంలో పెట్రోల్,డీజిల్ ధరల్లో పెద్దగా మార్పులు చోటుచేసుకోలేదు. అయితే 2024లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం లీటరుకు రూ.2 చొప్పున ధరలను తగ్గించింది. ఇటీవల పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా ఇంధన ధరలు పెరిగే అవకాశముందంటూ దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ప్రచారం జరిగింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం పలుమార్లు స్పందిస్తూ దేశంలో తగినంత ఇంధన నిల్వలు ఉన్నాయని స్పష్టం చేసింది. అయినప్పటికీ ఇప్పుడు ధరలను పెంచడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంధన ధరలు భారీగా పెరుగుతాయన్న వార్తలతో ముందుగానే వాహనదారుల్లో ఆందోళన మొదలైంది. అనేక ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద వాహనాల క్యూలు కనిపించాయి. కొన్ని కేంద్రాల్లో నిల్వలు తక్కువ కావడంతో 'నిల్వలు లేవు' అనే బోర్డులు కూడా పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వివరాలు
రాష్ట్రాల వారీగా చూస్తే..
ఇక సీఎన్‌జీ వాహనదారులకు కూడా గ్యాస్ సంస్థలు షాక్ ఇచ్చాయి. కిలో సీఎన్‌జీ ధరను రూ.2 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. రాష్ట్రాల వారీగా చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్‌పై రూ.3.29, డీజిల్‌పై రూ.3.14 పెరిగింది. తెలంగాణలో పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ.3 చొప్పున ధరలు పెంచారు. ప్రస్తుతం దేశ ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధరలు ఇలా ఉన్నాయి. దిల్లీలో లీటరు పెట్రోల్ రూ.97.77, కోల్‌కతాలో రూ.108.74, ముంబయిలో రూ.106.68, చెన్నైలో రూ.103.67గా ఉన్నాయి. డీజిల్ ధరలు దిల్లీలో రూ.90.67, కోల్‌కతాలో రూ.95.13, ముంబయిలో రూ.93.14, చెన్నైలో రూ.95.25గా కొనసాగనున్నాయి.