సీఎం వద్దకు రామచంద్రపురం పంచాయతీ.. జగన్‌తో పిల్లి సుభాష్ భేటీ
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం వైసీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై వైసీసీ అధిష్టానం దృష్టి సారించింది. ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణల మధ్య వర్గపోరు నడుస్తోంది. ఈ క్రమంలో వైసీసీ అధినేత, సీఎం వై.ఎస్.జగన్ నుంచి పిల్లి సుభాస్ చంద్రబోస్ కు పిలుపు వచ్చింది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్వయంగా పిల్లి సుభాస్ చంద్రబోస్ కు ఫోన్ చేసి తాడేపల్లికి రావాలని ఆదేశించారు. దీంతో సుభాష్ మంగళవారం తాడేపల్లికి బయలుదేరారు. మంత్రి వేణుగోపాల్ కృష్ణ, ఆయన వర్గీయుల వ్యవహార శైలిపై సీఎం జగన్ కు బోస్ ఫిర్యాదు చేశారు.
రామచంద్రాపురంలో రెండు గ్రూపులుగా చీలిపోయిన వైసీసీ
గత కొన్ని రోజులుగా రామచంద్రాపురంలో వైసీసీ రెండు గ్రూపులుగా చీలిపోయింది. వచ్చే ఎన్నికల్లో రామచంద్రాపురం నుంచి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ పోటీ చేస్తారని వైసీసీ ఎంపీ మిథున్ రెడ్డి ప్రకటించాడు. ఇదిలా ఉంటే ఆ నియోజకవర్గం నుంచే తన కొడుకు సూర్యప్రకాశ్ బరిలోకి దించాలని బోస్ భావిస్తున్నాడు. సూర్యప్రకాశ్‌ను కాదని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణకు టికెట్ ఇస్తే ఓడించి తీరుతామని బోస్ వర్గీయులు శపథం చేశారు. గోదావరి జిల్లా ఇంచార్జ్‌గా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి ఇటీవల మూడు రోజులు గోదావరి జిల్లాలో ఉన్నా కూడా సుభాష్ ఆయన్ను కలిసేందుకు రాలేదు. ఈ నేపథ్యంలో వైసీసీ అధిష్టానం ఏ మేరకు నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.