LOADING...
Air India Crash: చివరిక్షణంలోనూ స్టీరింగ్ కాలమ్ పట్టుకొని.. ప్రయాణికుల కోసం చివరి వరకూ పోరాటం చేసిన పైలట్
ప్రయాణికుల కోసం చివరి వరకూ పోరాటం చేసిన పైలట్

Air India Crash: చివరిక్షణంలోనూ స్టీరింగ్ కాలమ్ పట్టుకొని.. ప్రయాణికుల కోసం చివరి వరకూ పోరాటం చేసిన పైలట్

వ్రాసిన వారు Sirish Praharaju
May 18, 2026
12:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

అహ్మదాబాద్‌లో గతేడాది జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించిన మరో హృదయ విదారక విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రమాద సమయంలో విమానంలోని ప్రయాణికులను రక్షించేందుకు పైలట్ సుమిత్ సబర్వాల్ చివరి క్షణం వరకూ ప్రయత్నించినట్లు వెల్లడైంది. ఆయన మృతదేహాన్ని పరిశీలించిన వ్యక్తులు తెలిపిన వివరాలు ఇప్పుడు భావోద్వేగానికి గురిచేస్తున్నాయి. గత జూన్‌లో అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్ది సేపటికే ఎయిరిండియా విమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో మొత్తం 260 మంది ప్రాణాలు కోల్పోయారు.మృతుల్లో తన కుటుంబానికి చెందిన ముగ్గురు ఉన్నారని రోమిన్ వోహ్రా అనే వ్యక్తి వెల్లడించారు. కరోనా సమయంలో అహ్మదాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో పాథాలజీ ప్రయోగశాల సహాయకుడిగా పనిచేసిన అనుభవంతో మార్చురీలోకి వెళ్లేందుకు తనకు అనుమతి లభించిందన్నారు.

వివరాలు 

కలచివేసిన సుమిత్ సబర్వాల్ మృతదేహం : వోహ్రా

మృతదేహాల మధ్య కనిపించిన దృశ్యాలు జీవితాంతం మర్చిపోలేనివని ఆయన భావోద్వేగంతో చెప్పారు. తల్లి ఒడిలోనే కాలిపోయిన చిన్నారి మృతదేహం, తీవ్రంగా ఛిద్రమైన శరీరాలు అక్కడ కనిపించాయని తెలిపారు. తన మూడేళ్ల మేనకోడలి మృతదేహాన్ని వెతుకుతుండగా ఆ దృశ్యాలు కళ్లముందు నిలిచిపోయాయని అన్నారు. అయితే కెప్టెన్ సుమిత్ సబర్వాల్ మృతదేహాన్ని చూసినప్పుడు తాను మరింత కలచివేసినట్లు వోహ్రా తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆయన కూర్చున్న భంగిమలోనే ఉన్నారని చెప్పారు. శరీరం వెనుక భాగం కాలిపోయినా, ముందుభాగం మాత్రం ఎక్కువగా దెబ్బతినలేదన్నారు. పైలట్ ధరించిన యూనిఫాం, చెప్పులు కూడా దాదాపు అలాగే ఉన్నాయని వెల్లడించారు.

వివరాలు 

మార్చురీలో ప్రత్యేకంగా పైలట్ మృతదేహం

అత్యంత ఆశ్చర్యానికి గురిచేసిన విషయం ఏమిటంటే.. విమానాన్ని నియంత్రించే స్టీరింగ్ కాలమ్ ఆయన చేతుల్లోనే ఉండటమని వోహ్రా పేర్కొన్నారు. విమానాన్ని అదుపులోకి తెచ్చేందుకు చివరి క్షణం వరకూ ఆయన ప్రయత్నించినట్లు ఆ దృశ్యం స్పష్టంగా తెలియజేసిందన్నారు. పైలట్ మృతదేహాన్ని మార్చురీలో ప్రత్యేకంగా ఉంచినట్లు కూడా చెప్పారు. ప్రమాద సమయంలో లేదా మృతదేహాన్ని బయటకు తీసే సమయంలో స్టీరింగ్ భాగం విరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. మార్చురీలో ఉన్న మరో వైద్యుడు కూడా ఇదే విషయాన్ని ధృవీకరించినట్లు సమాచారం. ఈ వివరాలపై విమానయాన నిపుణులు స్పందిస్తూ.. పైలట్ చివరి వరకూ ప్రయాణికుల ప్రాణాలు కాపాడేందుకు పోరాడినట్లు స్పష్టమవుతోందని అభిప్రాయపడుతున్నారు.

Advertisement

వివరాలు 

రెండు ఇంజిన్లకు ఇంధన సరఫరా నిలిచిపోవడమే ప్రమాదానికి కారణం 

ఈ ఘటనపై గత జులైలో విమాన ప్రమాదాల దర్యాప్తు సంస్థ ప్రాథమిక నివేదిక విడుదల చేసింది. రెండు ఇంజిన్లకు ఇంధన సరఫరా నిలిచిపోవడమే ప్రమాదానికి కారణమని అందులో పేర్కొన్నారు. ఇంధన సరఫరా ఎందుకు నిలిపేశావని ఒక పైలట్ ప్రశ్నించగా.. తాను అలా చేయలేదని మరో పైలట్ సమాధానం ఇచ్చిన సంభాషణ కాక్‌పిట్ ధ్వని రికార్డర్‌లో నమోదైందని వెల్లడించారు. దీంతో పైలట్ల నిర్లక్ష్యం కారణమా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ నివేదికను పైలట్ సంఘాలు తీవ్రంగా తప్పుబట్టాయి. ప్రమాదానికి పైలట్ల తప్పిదమే కారణమని దేశంలో ఎవరూ నమ్మడం లేదని సుమిత్ సబర్వాల్ తండ్రి దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించడం గమనార్హం.

Advertisement