LOADING...
Hyderabad: రోజూ 8,500 టన్నుల చెత్తను విద్యుత్తుగా మార్చే ప్లాన్
రోజూ 8,500 టన్నుల చెత్తను విద్యుత్తుగా మార్చే ప్లాన్

Hyderabad: రోజూ 8,500 టన్నుల చెత్తను విద్యుత్తుగా మార్చే ప్లాన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 17, 2025
12:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్ చెత్తను సజీవ వనరుగా మార్చి విద్యుత్తు ఉత్పత్తి చేస్తూ రికార్డులు సృష్టిస్తున్న దిశగా ముందడుగు వేస్తోంది. ఇప్పటికే జవహర్‌నగర్‌లో 24 మెగావాట్ల సామర్థ్యంతో పనిచేసే విద్యుదుత్పత్తి కేంద్రం, దుండిగల్‌లో 15 మెగావాట్ల సామర్థ్యం కలిగిన కేంద్రం ఉన్నాయి. తాజాగా జవహర్‌నగర్ డంపింగ్ యార్డులో నిర్మించిన రెండో కేంద్రం ప్రారంభంకోసం సిద్ధమవుతోంది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్తును డిస్కన్‌కి పంపేందుకు అవసరమైన అనుమతులను అధికారులు ఎదురుచూస్తున్నారు. భవిష్యత్తులో వచ్చే రెండు ఏళ్లలో మరో మూడు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని బల్దియా పేర్కొంది. నగరంలో ఎక్కువ మొత్తంలో చెత్త నుంచి విద్యుత్తు ఉత్పత్తి చేసే నగరాల్లో హైదరాబాద్ రెండో స్థానంలో ఉందని కార్యనిర్వాహక ఇంజినీరు శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

Details

మొదటి స్థానం వైపుగా

నగరంలో రోజూ సుమారు 8,500 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది. అందులో 4,500 టన్నులు పొడి చెత్త. ప్రస్తుతం జవహర్‌నగర్ 24 మెగావాట్ల కేంద్రంలో రోజుకు 1,350 టన్నుల పొడి చెత్త, దుండిగల్ కేంద్రంలో 800 టన్నుల పొడి చెత్త భస్మం అవుతుంది. రెండో విద్యుదుత్పత్తి కేంద్రం ప్రారంభమైన తరువాత మరో 1,350 టన్నుల చెత్తను భస్మం చేస్తారు. మిగతా 1,000 టన్నుల పొడి చెత్తను దగ్గర్లోని సిమెంట్ కంపెనీలకు పంపిస్తారు. భవిష్యత్తులో మరో మూడు విద్యుదుత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసి, చెత్త ద్వారా 100 మెగావాట్లకు పైగా విద్యుత్తు ఉత్పత్తి చేసే లక్ష్యంతో హైదరాబాద్ దిల్లీని వెనక్కి నెట్టి మొదటి స్థానంలో నిలిచే దిశగా వెళ్తుందని జీహెచ్‌ఎంసీ తెలిపింది.