Loading...
Bhopal: భోపాల్‌లో రైల్‌ నీర్‌ కలకలం.. నాణ్యత పరీక్షల్లో నీటి నమూనా విఫలం
భోపాల్‌లో రైల్‌ నీర్‌ కలకలం.. నాణ్యత పరీక్షల్లో నీటి నమూనా విఫలం

Bhopal: భోపాల్‌లో రైల్‌ నీర్‌ కలకలం.. నాణ్యత పరీక్షల్లో నీటి నమూనా విఫలం

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 15, 2026
09:59 am

ఈ వార్తాకథనం ఏంటి

రైలు ప్రయాణికులకు అందించే తాగునీరు,ఆహార పదార్థాల నాణ్యతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భోపాల్‌ రైల్వే డివిజన్‌లో నిర్వహించిన సాధారణ నాణ్యత తనిఖీల్లో ఐఆర్‌సీటీసీకి చెందిన 'రైల్‌ నీర్‌' నీటి నమూనాతో పాటు,ఆహార తయారీలో ఉపయోగించే శనగపిండి నమూనా కూడా నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా లేవని గుర్తించారు. దీంతో ప్రయాణికుల భద్రతపై ప్రశ్నలు తలెత్తాయి.ఇటీవల నిర్వహించిన సాధారణ పరీక్షల్లో భాగంగా రైల్‌ నీర్‌ బాటిల్‌ నుంచి నీటి నమూనాను సేకరించారు. డివిజన్‌ స్థాయి పరిశీలనల్లో ఆ నమూనా నిర్దేశిత నాణ్యత ప్రమాణాలను అందుకోలేదని తేలింది. అదే విధంగా ఆహార పదార్థాల తయారీలో వినియోగించే శనగపిండి నమూనా కూడా నాణ్యత పరీక్షలో విఫలమైంది. ఈ పరిణామాన్ని అధికారులు తీవ్రంగా పరిగణించి, తదుపరి చర్యలపై దృష్టి సారించారు.

వివరాలు 

రోజుకు 1.14 లక్షల మంది ప్రయాణికులు

2025-26 గణాంకాల ప్రకారం భోపాల్‌ రైల్వే డివిజన్‌లో రోజుకు సగటున 1.14 లక్షల మంది ప్రయాణిస్తున్నారు.

భోపాల్‌ జంక్షన్‌లోనే ప్రతిరోజూ 150కుపైగా రైళ్లు ఆగుతుండగా.. సుమారు 70 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు.

మండీదీప్‌ ప్లాంట్‌ నుంచి రాణి కమలాపురం, నర్మదాపురం, ఇటార్సీ, విదిశ, గంజ్‌ బసోడా తదితర స్టేషన్లకు రోజుకు సుమారు 5,000 రైల్‌ నీర్‌ బాటిళ్లు సరఫరా అవుతున్నాయి.

ఒక్కో లీటరు బాటిల్‌ ధర రూ.14గా లెక్కిస్తే.. రోజువారీ సరఫరా విలువ సుమారు రూ.70 వేలుగా ఉంటుంది.

ఈ లెక్కన ఏడాదికి దాదాపు రూ.2.55 కోట్ల వ్యాపారం జరుగుతున్నట్లు తెలుస్తోంది.

వివరాలు 

మరిన్ని బాటిళ్లకు నాణ్యత పరీక్షలు

ఈ వ్యవహారంపై భోపాల్‌ డివిజన్‌ సీనియర్‌ డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ సౌరభ్‌ కటారియా స్పందించారు.

రైల్‌ నీర్‌ నాణ్యతను క్రమం తప్పకుండా పరీక్షిస్తున్నామని తెలిపారు.

ఒక నీటి నమూనాపై అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో.. అదే బ్యాచ్‌కు చెందిన మరికొన్ని బాటిళ్లను అదనపు పరీక్షల కోసం సేకరించినట్లు వెల్లడించారు.

ఐఆర్‌సీటీసీ అధికారులు కూడా పరీక్షల నిమిత్తం సుమారు 10 బాటిళ్లను పంపినట్లు తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు.

కాగా, గతంలో ఇటార్సీ బేస్‌ కిచెన్‌లో నిర్వహించిన తనిఖీల్లో గడువు ముగిసిన, నాణ్యత లేని ఆహార పదార్థాలను గుర్తించారు. అనంతరం వాటిని ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.

ADVERTISEMENT