PM CARES Fund: పీఎం కేర్స్ ఫండ్‌కు రికార్డు స్థాయి నిధులు.. రూ.8,452 కోట్లకు చేరిన కార్పస్!
ఈ వార్తాకథనం ఏంటి
పీఎం కేర్స్ ఫండ్ కార్పస్ భారీగా పెరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఈ నిధి మొత్తం విలువ రూ.8,452.07 కోట్లకు చేరుకుంది. పెట్టుబడుల నిర్వహణలో తీసుకొచ్చిన మార్పులు, ముఖ్యంగా నిధులను సేవింగ్స్ ఖాతాల నుంచి ఫిక్స్‌డ్ డిపాజిట్లకు మళ్లించడం వల్లే ఈ స్థాయిలో వృద్ధి సాధ్యమైనట్లు తాజా ఆడిట్ నివేదికలు వెల్లడించాయి. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో పీఎం కేర్స్ ఫండ్‌లో రూ.7,173.03 కోట్ల నిధులు ఉన్నాయి.
వివరాలు
పొదుపు ఖాతాల నుంచి ఫిక్స్‌డ్ డిపాజిట్లకు నిధుల మళ్లింపు
ఏడాది ముగిసే సరికి ఈ మొత్తం గణనీయంగా పెరిగింది.గతంలో ఫండ్‌లోని అధిక మొత్తాన్ని సేవింగ్స్ ఖాతాల్లోనే ఉంచేవారు.
అయితే మెరుగైన రాబడి పొందే లక్ష్యంతో నిధులను ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం మొత్తం నిధుల్లో రూ.6,641 కోట్లు ఎఫ్‌డీల్లో ఉన్నాయి.
మరోవైపు సేవింగ్స్ ఖాతాల్లో రూ.605.41కోట్లు మాత్రమే ఉన్నాయి. అంటే పీఎం కేర్స్ ఫండ్‌లోని మొత్తం నిధుల్లో సుమారు 92.8శాతం ఫిక్స్‌డ్ డిపాజిట్లలోనే ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి.
ఎఫ్‌డీల్లో పెట్టిన నిధుల ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో రూ.469.38 కోట్ల వడ్డీ ఆదాయం వచ్చింది.
అదే సమయంలో సేవింగ్స్ ఖాతాల నుంచి వచ్చిన వడ్డీ కేవలం రూ.5.77 కోట్లు మాత్రమే. దీనికితోడు దేశీయ విరాళాల రూపంలో రూ.479.04 కోట్లు ఫండ్‌కు అందాయి.
వివరాలు
కొవిడ్ బాధితుల పిల్లల కోసం కొనసాగుతున్న ఖర్చులు
విదేశాల నుంచి రూ.92.83 లక్షల విరాళాలు వచ్చాయి. వివిధ ఏజెన్సీల నుంచి మరో రూ.324.66 కోట్ల రిఫండ్‌లు కూడా పీఎం కేర్స్ ఫండ్‌లో జమయ్యాయి.
కరోనా మహమ్మారి తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో 2020 మార్చి 27న కేంద్ర ప్రభుత్వం పీఎం కేర్స్ ఫండ్‌ను పబ్లిక్ ఛారిటబుల్ ట్రస్ట్‌గా ఏర్పాటు చేసింది.
దేశంలో విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రజలకు తక్షణ ఆర్థిక సహాయం అందించడం దీని ప్రధాన ఉద్దేశం.
ప్రస్తుతం కరోనా సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు అండగా నిలిచేందుకు అమలు చేస్తున్న 'పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్' పథకానికి ఈ ఫండ్ నుంచి నిధులు ఖర్చు చేస్తున్నారు.