Andhra news: రేపే 'పీఎం కిసాన్- అన్నదాతా సుఖీభవ' నిధుల విడుదల.. కమలాపురంలో కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరు
ఈ వార్తాకథనం ఏంటి
ఈ నెల 19వ తేదీన పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులు రైతులకు చేరనున్నాయి. రైతుల ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.2 వేలూ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.5 వేలూ ఇలా మొత్తం రూ.7 వేల చొప్పున జమ కానున్నాయి. వైఎస్సార్ కడప జిల్లాలోని కమలాపురంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నిధులను అధికారికంగా విడుదల చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 46.86 లక్షల మంది అర్హులైన కర్షకులకు రూ.3,135 కోట్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సోమవారం ప్రకటన విడుదల చేసింది. ఇదే పథకంలో భాగంగా ఆగస్టు నెలలో మొదటి విడతగా రూ.3,174 కోట్లు రైతులకు అందించబడిన విషయం తెలిసిందే.
వివరాలు
రైతు సేవా కేంద్రాల్లో ప్రత్యక్ష ప్రసారం
రెండు విడతలను కలిపి కేంద్రం-రాష్ట్రం కలిసి మొత్తం రూ.6,309.44 కోట్లు ఈ పథకంపై వ్యయం చేస్తున్నారు. ఈ నిధుల విడుదల కార్యక్రమాలకు కేంద్ర,రాష్ట్ర మంత్రులు,ఎంపీలు,ఎమ్మెల్యేలు హాజరవ్వాలని సీఎం చంద్రబాబు సూచించారు. నిధుల విడుదల కార్యక్రమాన్ని రాష్ట్రంలోని 10వేలకుపైగా ఉన్న రైతు సేవా కేంద్రాలైన ఆర్‌ఎస్‌కేల్లో లైవ్ టెలికాస్ట్ చేయాలని అధికారులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇది కేవలం నిధుల పంపిణీ మాత్రమే కాకుండా, ప్రభుత్వం తీసుకుంటున్న వ్యవసాయ విధానాలపై అవగాహన కల్పించేలా ఉండాలని ఆయన సూచించారు. అగ్రిటెక్ వినియోగం,అవసరమైన పంటల సాగు, మార్కెట్ సౌకర్యాల విస్తరణ,ప్రకృతి వ్యవసాయం ప్రోత్సాహం,భూసార పరీక్షలు, పంటల ప్రాసెసింగ్ ద్వారా రైతులకు అధిక లాభాలు వచ్చే మార్గాలు వంటి అంశాలను రైతులకు వివరించేలా కార్యక్రమం సిద్ధం చేయాలన్నారు.
వివరాలు
రైతుల ఫోన్లకు ముందే మెసేజ్‌లు పంపండి: అచ్చెన్నాయుడు
శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడిన వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు, పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ నిధులు ఖాతాల్లో జమకాబోయే విషయాన్ని రైతులకు ఒక రోజు ముందు SMS ద్వారా తెలియజేయాలని అధికారులకు ఆదేశించారు. రైతులకు సందేహాలు ఉంటే పరిష్కరించడానికి టోల్‌ఫ్రీ నంబర్ అందుబాటులో ఉండాలని తెలిపారు. అర్హులైన రైతు మరణించినప్పుడు, వారి వారసులకు డెత్ మ్యూటేషన్ ప్రక్రియ పూర్తిచేసి పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మొదటి విడతలో నిధులు రాకపోయిన రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి, అర్హులకు తప్పనిసరిగా ప్రయోజనం అందేలా చూడనున్నట్లు ఆయన చెప్పారు.