PM Modi at G20 summit: 6-పాయింట్ల ఎజెండా,AI రక్షణలు, UNSC సంస్కరణలు.. జీ20 సదస్సులో భారత ప్రధాని
ఈ వార్తాకథనం ఏంటి
ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో సంస్కరణలు తీసుకురావడం ఇక ఎంతమాత్రం ఆప్షన్ కాదని, అది తప్పనిసరి అని భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. కృత్రిమ మేధ నుంచి ఆధునిక సాంకేతిక ఆవిష్కరణల వరకు—ఇవి కొద్దిమంది దేశాలకే పరిమితమై ఉండకూడదని, ప్రపంచవ్యాప్తంగా ప్రతి మనిషికి అందుబాటులోకి రావాలని ఆయన అన్నారు. దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో ఆదివారం జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ సందర్భంగా దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసాతో భేటీ అయ్యారు. భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా నేతల సమావేశంలోనూ కీలక అంశాలను ప్రస్తావించారు. మూడు దేశాల మధ్య భద్రతా సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి జాతీయ భద్రతా సలహాదారుల స్థాయి సమావేశాలను క్రమబద్ధీకరించాలని సూచించారు.
వివరాలు
మనది హృదయపూర్వక బంధం
ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో మూడు దేశాలూ సమన్వయంతో ముందుకు సాగాలని, ఈ విషయంలో ద్వంద్వ విధానాలకు చోటు ఉండకూడదని మోదీ అన్నారు. ప్రజల అభివృద్ధికి సాంకేతికత అత్యంత కీలకం కావడంతో,యూపీఐ,కొవిన్ వంటి భారత చొరవలను పంచుకునేలా ఒక వేదికను ఏర్పాటు చేయాలని సూచించారు. సైబర్ భద్రతపై కూడా మూడు దేశాలు కలిసి పని చేయాల్సిన అవసరాన్ని ఆయన గుర్తుచేశారు. వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయ పద్ధతులకు ఐబీఎస్‌ఏ సహాయం చేయగలదని పేర్కొన్నారు. ఇది కేవలం మూడు దేశాల కూటమి మాత్రమే కాకుండా, మూడు ఖండాలను కలుపుతున్న అనుసంధాన వేదిక అని గుర్తు చేశారు. ప్రజల భద్రతను కేంద్రంగా ఉంచిన విశ్వసనీయ,సురక్షిత ఏఐ నిబంధనల రూపకల్పనలో ఈ కూటమి ముఖ్య పాత్ర పోషించగలదని అన్నారు.
వివరాలు
దేశాధినేతలతో చర్చలు
దక్షిణార్ధగోళ దేశాల ఆశయాలు, అభిలాషలు గట్టిగా వినిపించేలా చేయడంలో భారత్ కొనసాగుతుందని తెలిపారు. ఏఐను దుర్వినియోగం చేసే మార్గాలను ఆపాలని, డీప్‌ఫేక్‌లు మరియు ఉగ్రచర్యల్లో దాని వినియోగాన్ని నిరోధించాలని పిలుపునిచ్చారు. ఏఐను ఇవాళ్టి ఉద్యోగాల కళ్లజోడుతో కాకుండా, భవిష్యత్తు సామర్థ్యాల దృష్టితో చూడాలన్నారు. జపాన్ ప్రధానమంత్రి సనాయె తకాయిచి, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, కెనడా ప్రధాని మార్క్ కార్నే, జమైకా ప్రధాని ఆండ్రూ హెల్నెస్, నెదర్లాండ్స్ ప్రధానమంత్రి డిక్ స్కోఫ్‌లతో మోదీ వేర్వేరు సమావేశాలు నిర్వహించారు. రక్షణ రంగంలో భారత్-కెనడా సహకారం విస్తరించే దిశగా కార్నేతో చర్చించిన విషయాన్ని ఆయన 'ఎక్స్' వేదిక ద్వారా వెల్లడించారు.
వివరాలు
పగ్గాలు తీసుకోని అమెరికా
కార్నేను భారత్‌కు రావాలని కూడా ఆహ్వానించారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అధిపతి క్రిస్టలీనా జార్జీవాతోనూ సమావేశం నిర్వహించిన తర్వాత, ఆదివారం సాయంత్రం ఆయన దిల్లీకి బయల్దేరారు. జీ20 వచ్చే ఏడాది అధ్యక్ష బాధ్యతలు అమెరికాకు అప్పగించాల్సి ఉండగా, అధ్యక్షుడు ట్రంప్ ముందుగానే ఈ కార్యక్రమంలో పాల్గొనబోమని ప్రకటించి సమావేశానికి రాకపోవడంతో, ఈ బాధ్యతలను సోమవారం దక్షిణాఫ్రికా విదేశాంగ-సహకార శాఖ కార్యాలయానికి అధికారికంగా అప్పగించనున్నారు.
వివరాలు
ఇంత కష్టమంటే మేం పారిపోయేవాళ్లం!
వాణిజ్యం, పెట్టుబడులు, ఆహార భద్రత, కృత్రిమ మేధ రంగాల్లో భారత్-దక్షిణాఫ్రికా భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే అంశాలపై మోదీ-రమఫోసా చర్చించారు. అంకుర పరిశ్రమలకు పెట్టుబడులు సులభంగా అందేలా చేసే దిశలో ఇద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. జీ20 సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు మోదీ రమఫోసాను అభినందించగా, "సదస్సు నిర్వహణ ఇంత క్లిష్టమని మీరు ముందే చెప్పుంటే... మేమేమో పారిపోయి ఉండేవాళ్లం!" అని రమఫోసా నవ్వుతూ స్పందించారు. దాంతో అక్కడున్నవారంతా నవ్వుల్లో మునిగిపోయారు. దిల్లీలో భారత్ నిర్వహించిన భారీ స్థాయి జీ20 సదస్సును ప్రస్తావిస్తూ, "మేము మీలాగా అంత పెద్దగా చేయలేకపోయాం, చిన్నగా చేశాం" అని రమఫోసా అన్నాడు. దానికి మోదీ "చిన్నదే అందంగా ఉంటుంది" అని చిరునవ్వుతో బదులిచ్చారు.