LOADING...
PM Modi: ప్రధానిగా నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు.. ఇందిరాగాంధీ రికార్డును అధిగమించి..
ప్రధానిగా నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు.. ఇందిరాగాంధీ రికార్డును అధిగమించి..

PM Modi: ప్రధానిగా నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు.. ఇందిరాగాంధీ రికార్డును అధిగమించి..

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 25, 2025
10:17 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన రాజకీయ జీవితంలో మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. భారతదేశ ప్రధానిగా ఎలాంటి విరామం లేకుండా అత్యధిక కాలం కొనసాగిన నేతగా మోదీ, ఇందిరా గాంధీ నెలకొల్పిన రికార్డును అధిగమించారు. జూలై 25వ తేదీతో మోదీ ప్రధానిగా కొనసాగుతున్న రోజులు 4,708కి చేరాయి. దీంతో ఏకధాటిగా ఎక్కువకాలం ప్రధానిగా కొనసాగిన నాయకుల్లో మోదీ, జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత రెండో స్థానంలో నిలిచారు. ఇందిరా గాంధీ 1966 జనవరి 24న ప్రధానిగా బాధ్యతలు చేపట్టి, 1977 మార్చి 24 వరకు పదవిలో కొనసాగుతూ మొత్తం 4,077 రోజులు దేశాన్ని పరిపాలించారు. అయితే, దేశానికి తొలి ప్రధానిగా,వరుసగా అత్యధికకాలం పదవిలో ఉన్న ఘనత జవహర్‌లాల్ నెహ్రూదే.

వివరాలు 

పార్టీకి విజయాన్ని అందించిన నేతల జాబితాలో నెహ్రూ, మోదీ

మోదీ 2014 మే 26న తొలిసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత జరిగిన రెండు లోక్‌సభ ఎన్నికల్లోనూ తన నాయకత్వంలో బీజేపీని ఘన విజయం సాధించింది. వరుసగా మూడు సార్లు లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి విజయాన్ని అందించిన నేతల జాబితాలో నెహ్రూ, మోదీ మాత్రమే ఉన్నారు. స్వాతంత్య్రం అనంతరం జన్మించిన వారిలో అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగిన నేతగా మోదీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం పొందారు. అలాగే కాంగ్రెసేతర పార్టీల నుంచి రెండుసార్లు సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన నాయకుడిగా మోదీనే ఏకైక వ్యక్తి. 1971లో ఇందిరా గాంధీ తర్వాత,అత్యధిక మెజారిటీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ప్రధానిగా మోదీ గుర్తింపు పొందారు.

వివరాలు 

ఆరు సార్లు జరిగిన ఎన్నికల్లో పార్టీకి విజయాన్ని అందించిన ఏకైక నేత

2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మోదీ, 2014 వరకు ఆ పదవిలో కొనసాగారు. అనంతరం ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఇప్పటికీ పదవిలో కొనసాగుతున్నారు. ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత ప్రధానమంత్రిగా విరామం లేకుండా పదవిలో కొనసాగిన అరుదైన నాయకుడిగా మోదీ పేరు నిలిచింది. దేశ రాజకీయ చరిత్రలో వరుసగా ఆరు సార్లు జరిగిన ఎన్నికల్లో పార్టీకి విజయాన్ని అందించిన ఏకైక నేతగా మోదీ గుర్తింపు పొందారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా 2002,2007, 2012లో బీజేపీకి విజయాన్ని తెచ్చారు. కేంద్ర రాజకీయాల్లో ప్రధాని అభ్యర్థిగా 2014, 2019, 2024లో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఈ విధంగా రాష్ట్రం నుంచి కేంద్రం వరకు తన నాయకత్వంలో వరుస విజయాలతో మోదీ అనుకోని ఘనతను పొందారు.

వివరాలు 

విద్యార్థి దశలోనే ఆర్‌ఎస్‌ఎస్‌లో

1950లో జన్మించిన నరేంద్ర మోదీ, హీరాబెన్‌, దామోదర్‌దాస్ మోదీ దంపతులకు మూడో సంతానంగా పుట్టారు. విద్యార్థి దశలోనే ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరి స్వయంసేవకుడిగా సేవలు అందించారు. ఆ సమయంలో నుంచే రాజకీయాల పట్ల ఆసక్తి పెరిగింది. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కొద్ది కాలంలోనే బీజేపీ నాయకత్వ దృష్టిని ఆకర్షించారు. మోదీ ప్రతిభను గుర్తించిన ఎల్‌కే ఆడ్వాణీ ఆయనను ప్రోత్సహించారు. 1990లో జరిగిన ఆడ్వాణీ రథయాత్రలో మోదీ కీలక పాత్ర పోషించారు. 1992లో మురళీమనోహర్ జోషి చేపట్టిన కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు సాగిన ఏక్తా యాత్రకు మోదీ జాతీయ ఇన్‌చార్జిగా వ్యవహరించారు. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు.

వివరాలు 

 గోద్రా అల్లర్ల సమయంలో మోదీ తీరుపై తీవ్ర విమర్శలు 

2002లో గోద్రా అల్లర్ల సమయంలో మోదీ తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. సీఎం పదవికి రాజీనామా చేయాలని ఎన్డీయే మిత్రపక్షాల నుంచి కూడ డిమాండ్లు వచ్చాయి. అయినా ఆయన ఆ పదవిలో కొనసాగారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టే వరకు గుజరాత్ సీఎంగా కొనసాగుతూ, వరుసగా మూడు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని విజయం వైపు నడిపించారు. ఈ ప్రస్థానం ప్రధానిగా మారి దేశవ్యాప్తంగా తన నాయకత్వాన్ని నిలబెట్టింది.