PM Modi: దేశం మొత్తం మణిపూర్ వెంటే ఉంది: స్వాతంత్య్ర వేడుకల్లో ప్రధాని మోదీ
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం జాతినుద్దేశించి మాట్లాడారు. ప్రస్తుతం ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శిస్తున్న, దేశంలోనే హాట్ టాపిక్‌గా ఉన్న మణిపూర్ అంశంపై ప్రధాని మోదీ ప్రసంగించారు. దేశం మొత్తం మణిపూర్‌తో ఉందని ప్రధాని స్పష్టం చేశారు. మణిపూర్‌లో గతంలో హింసాత్మక పరిస్థితులు ఉండేవని, ఇప్పుడు అక్కడ పరిస్థితి మామూలుగా ఉందన్నారు. శాంతిభద్రతలను పునరుద్ధరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని మోదీ పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళలపై జరిగిన హింసాకాండ, అఘాయిత్యాలను మోదీ ఖండించారు. అనేక మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేసారు. మన తల్లులు, సోదరీమణులు పరువు తీశారని ప్రధాని మోదీ అసహనం వ్యక్తం చేశారు.
శాంతి ద్వారానే మణిపూర్ సమస్యకు పరిష్కారం: మోదీ
శాంతి ద్వారానే మణిపూర్‌లో పరిష్కార మార్గం దొరుకుతుందని ప్రధాని మోదీ స్పష్టం చేసారు. మణిపూర్‌లో పరిస్థితిపై ప్రధాని మోదీ మాట్లాడడం గత ఏడు రోజుల్లో ఇది రెండోసారి. గత వారం లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో ప్రధాని మోదీ మణిపూర్ అంశంపై మాట్లాడారు. మణిపూర్‌లో హింస, ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు క్షమించరానివని, బాధ్యులను శిక్షిస్తామని అన్నారు. లోక్‌సభలో కూడా మణిపూర్‌లో శాంతి నెలకొంటుందని హామీ ఇచ్చిన ప్రధాని మోదీ, రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని అన్నారు. మే 3న మణిపూర్‌లో జాతి ఘర్షణలు చెలరేగడంతో 160 మందికి పైగా మరణించారు. మరియు అనేక వందల మంది గాయపడ్డారు.